Raja Singh: నన్ను, యోగిని చంపేస్తారట.. బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదు చేసిన బీజీపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

Telangana Assembly Election 2023: ఎన్నికల సమయంలో గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. తన భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తనతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కు ప్రాణహాని ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. చంపేస్తానంటూ కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ పేర్కొన్న రాజాసింగ్ బుధవారం తనకు మరో బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపారు. తనను, తన కుంటుంబాన్ని, ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోతో పాటు నగర పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు లేఖను రాజాసింగ్ విడుదల చేశారు. కాల్ చేసిన వ్యక్తి సుమారు 6 నిమిషాల పాటు మాట్లాడాడని.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ ఫిర్యాదులో తెలిపారు.

సిటీ పోలీసులకు ఇచ్చిన వీడియో స్టేట్‌మెంట్‌లో.. బుధవారం మధ్యాహ్నం 1:59 గంటలకు తనకు కాల్ వచ్చిందని రాజాసింగ్ చెప్పారు. “ఎన్నికలు లేదా కౌంటింగ్ రోజు ముందు నన్ను, నా కుటుంబానికి హాని కలిగిస్తామని కాలర్ బెదిరించాడు.. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గోష్‌మహల్‌లో ప్రచారం చేసేందుకు నగరానికి వచ్చినప్పుడు తమకు హాని తలపెడతామని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు.. ఆ నంబర్ కాలర్ ఐడీ విదేశాలకు చెందినది..’’ అంటూ రాజాసింగ్ తెలిపారు.

“ఈ వ్యక్తికి నా ప్రతి కదలిక గురించి హైదరాబాద్‌లో నివసించే వ్యక్తి నిరంతరం వివరిస్తున్నాడు. నా కుటుంబ సభ్యుల గురించి.. నేను ప్రచారానికి వెళ్లినప్పుడు.. ఏ బుల్లెట్ నడుపుతానో, అలాగే పలు విషయాల గురించి అతనికి తెలుసు” అని రాజా సింగ్ వివరించారు. “నేను గతంలో బెదిరింపు కాల్‌లను ఎదుర్కొన్నప్పటికీ, పోలీసులు ఈ ప్రత్యేక ముప్పును పరిష్కరించడం అత్యవసరం, ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్న ప్రస్తావన కారణంగా.. చర్యలు తీసుకోండి” అంటూ డిజిపికి విజ్ఞప్తి చేశారు.

కాగా.. వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం ఏడాది తర్వాత భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అంతేకాకుండా.. మళ్లీ బీజేపీ గోషామహాల్ టికెట్ ను కేటాయించింది. ఈ మేరకు ఫస్ట్ లిస్ట్‌లోనే బీజేపీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒక్క షేక్‌హ్యాండ్‌.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.. పవన్, నాని కలయిక వెనుక ఇంత అర్ధముందా?

ఒక్క షేక్‌హ్యాండ్‌.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ముఖ్యంగా గుడివాడలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బద్ద శత్రువుల్లాంటి ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఇలా హ్యాపీగా నవ్వుతూ కరచాలనం చేసుకోవడం చాలామందిని అర్ధం కాట్లేదు. అటూ.. ఇటూ.. వార్‌ అయితే కంటిన్యూ అవుతోంది. ఒక పెళ్ళి వేడుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది.

వంగవీటి రాధా పెళ్లి.. సరికొత్త చర్చకు దారి తీసింది. ఆయన పెళ్లికి హాజరైన సమయంలో కనిపించిన సీన్స్‌ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మాజీ మంత్రి,. వైసీపీ నేత కొడాలినాని.. ఈ ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం.. పైగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు ఇలా మెలగడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపిచింది కూడా. అయితే గుడివాడలో మాత్రం పొలిటికల్‌గా దుమారం రేగింది. మాజీ మంత్రి కొడాలిపై టీడీపీ, జనసేన నేతలు మండిపడ్డారు. కేవలం పవన్‌తో కరచాలనం కోసం.. నాని ఎంతకు దిగజారారో అంతా చూశారని ఆరోపించారు నేతలు. పవన్‌ చుట్టూ అభిమానులున్నా.. కొడాలి నాని మాత్రం వారిని తోసుకుంటూ వెళ్లి పవన్‌తో చెయ్యి కలిపారని మండిపడ్డారు.

అయితే వంగవీటి రాధా పెళ్లికి వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు. తనకు సన్నిహితులైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పెళ్లికి పిలిచారు. అంతేకాదు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కొడాలి నాని.. అప్పటికే పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆయన వంగవీటి రాధాను కంగ్రాట్స్‌ చెప్పేందుకు స్టేజ్‌ ఎక్కేలోపే పవన్‌ కల్యాణ్‌ రావడం జరిగింది. ఇద్దరూ ఎదురెదురుగా రావడంతో.. ముందు కొడాలి నాని నమస్కారం చేశారు.. అది చూసి పవన్‌ ప్రతి నమస్కారం చేసి.. కరచాలనం కోసం చేయి ఇచ్చారు. దీంతో నాని కూడా ముందుకు కదిలి చేయి కలిపారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అటు జనసేన వారు పవన్‌తో షేక్‌ హ్యాండ్‌ కోసం నాని ఎగబడ్డారంటే.. నానితో పరిచయం కోసం పవన్‌ చేయి ఇచ్చారంటూ ఎవరికి నచ్చిన పోస్టులు వారు పెడుతున్నారు.

అయితే పెళ్లికి వచ్చిన అతిథులు ఎదురుపడితే ఇలా నమస్కరించుకుని.. షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం కనీస సంస్కారం అంటూ మరికొందరు స్పందించారు. తెలుగు దేశం పార్టీ – జనసేన పార్టీలు మాత్రం కొడాలి నాని టార్గెట్‌ గానే ఆరోపణలు చేస్తున్నాయి. అసలు కొడాలి ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలంటూ జనసేన అంటోంది. రెండు బస్సులతో రెండు కోట్ల బెంజ్‌ కారు ఎలా కొన్నావంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

AP Politics: ఏపీలో హీటెక్కిన రాజకీయాలు.. పోటా పోటీ యాత్రలతో జనంలోకి వైసీపీ, టీడీపీ

ఆరు నెలల్లో ఎన్నికలు జరగునున్న ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నాలుగున్నరేళ్లలో చేసిన సంక్షేమం-అభివృద్ధి ఎజెండాగా మరోసారి ప్రజల్లోకి వెళ్తుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ప్రతిపక్ష తెలుగు దేశం, జనసేన పార్టీలు పోటా పోటీ యాత్రలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆయన భార్య భువనేశ్వరి జనం మద్యలోకి వచ్చారు.

సామాజిక సాధికార యాత్ర ద్వారా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోనే ఉన్న వైసీపీ కేడర్, తాజాగా ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర చేపడుతోంది. అక్టోబర్ 26 నుంచి 60 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్రలు కొనసాగనున్నాయి. ఒక్కో రోజు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని మూడు ప్రాంతాల్లో మూడు నియోజకవర్గాల్లో యాత్రలు జరగనున్నాయి. మద్యాహ్నం ఒంటి గంట నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

వైసీపీ సామాజిక సాధికార యాత్రకు సంబంధించి షెడ్యూల్ పార్టీ వర్గాలు విడుదల చేశాయి. అయా నియోజకవర్గాల్లో ముందుగా ఎంపిక చేసిన సచివాలయాన్ని వైసీపీ నేతలు సందర్శిస్తారు. ఇక్కడే ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్లు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, స్థానికంగా ఎంపిక చేసిన 200 మందితో కలిసి సహాపంక్తి భోజనం చేస్తారు. తర్వాత మీడియా సమావేశం ఉంటుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సామాజిక సాధికారత,గత ప్రభుత్వం పేదల విషయంలో వ్యవహారించిన తీరును ప్రజలకు వివరించనున్నారు. బస్సు యాత్ర వెళ్లే మార్గంలో ముందుగా నిర్ణయించిన చోట్ల ప్రజలతో మమేకం అవుతారు. అదే రోజు సాయంత్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తారు. సామాజిక సాధికార యాత్ర లో భాగంగా బస్సు పైనుంచే ప్రజల నుద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రసంగించనున్నారు. అక్టోబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సామాజిక సాధికార యాత్ర ను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రులు,ఇతర నేతలు లాంఛనంగా ప్రారంభించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పైనే స్పెషల్ ఫోకస్
సామాజిక సాధికార యాత్ర… పేరుకు తగ్గట్లుగానే బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేసింది వైసీపీ. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏవిధంగా ప్రాధాన్యత ఇచ్చిందో, ప్రజలకు వివరించడమే యాత్ర లక్ష్యంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. కేబినెట్‌తో పాటు ఇతర పదవుల్లోనూ భారీగా కేటాయింపులు చేయడం, ఆయా వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రను ఉపయోగించుకొనున్నారు వైసీపీ నేతలు. బస్సు యాత్రలో పేదలు పాల్గొనేలా చూడాలని సీఎం జగన్ ఇప్పటికే నేతలకు సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పేదలకు-పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతుందనే నినాదాన్ని బస్సు యాత్ర ద్వారా బలంగా తీసుకెళ్లాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో వైసీపీ నేతలు క్లాస్ వార్ స్లోగన్‌తో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లేదంటే సమన్వయకర్తలు అధ్యక్షతన బస్సు యాత్ర జరగనుంది. ప్రతి బస్సులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు తప్పకుండా ఉండేలా ప్లాన్ చేశారు. సభలు ఎలా జరగాలి. ఎలాంటి అంశాలతో ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే రీజినల్ కోఆర్డినేటర్లు సమావేశాలు పెట్టి వివరించారు. మొదటి విడతలో నవంబర్ 9 వ తేదీ వరకూ ఒక్కో రోజు మూడు ప్రాంతాల్లో యాత్రలు సాగనున్నాయి.
బస్సు యాత్ర మొదటి విడత షెడ్యూల్ రిలీజ్ చేసిన వైసీపీ
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వ తేదీ వరకూ మొదటి విడత సామాజిక సాధికార యాత్ర లు జరగనున్నాయి. దీనికి సంబందించిన పోస్టర్ ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు విడుదల చేశారు. మొదటి రోజు ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమ లో సింగనమలలో యాత్రలు జరగనున్నాయి. మొదటి విడతలో 39 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కోనసాగనుంది.
జనంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి
మరోవైపు స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టై జైల్లో ఉండటంతో ఇప్పుడు ఆయన భార్య భువనేశ్వరి జనం మద్యలోకి వచ్చారు. చేయి చేయి కలిపి పోరాటం చేద్దామని ప్రజలకు భువనేశ్వరి పిలుపినిచ్చారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె నుంచి యాత్రను ఆమె ప్రారంభించారు. తండ్రి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి, నిజం గెలవాలికి భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. ఆమె వెంట చిత్తూరు, తిరుపతి జిల్లాల టీడీపీ నేతలతో పాటు ఎమ్మెల్సీ అనురాధ, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు.
నిజం గెలవాలి యాత్రలో పరామర్శలు..
నిజం గెలవాలి యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టు వార్త విని ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. చంద్రగిరిలో మరణించిన ప్రవీణ్‌రెడ్డి, నేండ్రగుంటలో కన్నుమూసిన చిన్నబాబు కుటుంబాన్ని భువనేశ్వరి ఓదార్చారు. వారి కుటుంబాలకు 3 లక్షల చెక్కు అందజేశారు. కష్టకాలంలో అండగా ఉన్న ప్రతీ ఒక్కరి బాధ్యత పార్టీ తీసుకుంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. పరామర్శ తర్వాత చంద్రగిరిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు, రాజకీయాలు చేసేందుకు తాను రాలేదని భువనేశ్వరి అన్నారు. తానెప్పుడు ఇలా బయటకు రాలేదని తెలిపారు. నిజం గెలవాలన్నది ఒక పోరాటమని తెలిపారు.

అక్షయపాత్రలు విందు భోజనాలు.. రాజకీయ ప్రముఖులు, సీఎం రాక.. అదిరిపోయేలా రిసెప్షన్‌

పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవి అంత చాపలు పరిచేసి కోట్లు ఖర్చు కుమ్మరిస్తారు. విందు, చుట్టాలు, వందలాది కాదు వేలాది మందికి భోజనాలు వైభవంగా జరిపిస్తారు. కానీ..ఇక్కడ జరిగేది రిసెప్షన్‌ మాత్రమే..పెళ్లికి మించి ఏర్పాట్లు చేస్తున్నారు. పాతిక ఎకరాల విస్తీర్ణం.. 11 షెడ్డులు.. పదుల సంఖ్యలో వంట మాస్టర్లు.. 30 టీమ్‌లు.. 28 రకాల వంటలు.. ఇంతకీ ఎక్కడ?

తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం గోదావరి తీరాన అతిపెద్ద వేడుక జరగబోతోంది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్‌ వివాహ రిసెప్షన్‌ అంగరంగ వైభవంగా నిర్వహించేంందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్‌ వివాహ రిసెప్షన్‌ను రాజమండ్రి దివాన్‌ చెరువు డీవీబీ రాజు లేఔట్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేశారు. వివాహానికి లక్షలాది మందిని ఆహ్వానిస్తున్నారు. సుమారు మూడు లక్షల మందికి పైగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. 28 రకాల కాయగూరాలతో పసందైన విందు భోజనాన్ని జక్కంపూడి కుటుంబీకులు ఏర్పాటు చేస్తున్నారు.

డోలు, సన్నాయి వాయిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి వివాహ విందుకు రావాలని ఆహ్వానపత్రిక అందిస్తున్నారు జక్కంపూడి కుటుంబీకులు, వారి అభిమానులు. ఒక్క రాజమండ్రే కాదు…తూర్పు గోదావరిజిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి పలువురు స్థానికులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను ఆహ్వానించారు. వివాహ ఏర్పాట్లను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన అభిమానులు దగ్గరుండి అన్నీ ఏర్పాట్లు చూస్తున్నారు. గోదావరి తీరాన ఇంత పెద్ద వేడుక జరగడం ఇదే మొదటిసారని జక్కంపూడి అభిమానులు అంటున్నారు.

మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా జక్కంపూడి వారి వివాహ విందుకు హాజరవుతున్నారు. ఈ మేర‌కు అధికారులు సీఎం ప‌ర్యటన‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఉదయం 10.15 గంటలకు సీఎం జ‌గ‌న్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువు చేరుకుంటారు. అక్కడ డీబీవీ రాజు లే–అవుట్‌లో జరగనున్న విజయ్‌ గణేష్‌ మోహన్‌ వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. ముఖ్యమంత్రి వస్తుండటంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఇక ఈ వేడకకు తూర్పుగోదావరి జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి స్థానికులు, సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు రానున్నారు. అధిక సంఖ్యలో అతిథులు నియోజకవర్గం, వివిధ జిల్లాల వస్తుండటంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్రావు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమందికి గుర్తింపు ఉండడంతో.. ఆయనతో అనుబంధం ఉన్నా ప్రతిఒక్కరిని ఈ రిసెప్షన్ కీ ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. జక్కంపూడి వారు ఇచ్చే విందునతో పాటు వినోదాన్ని పంచే విదంగా పిల్లలకోసం ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు.

వచ్చే నెల 3న మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం.. ఏం చెప్పబోతున్నారంటే?

లుగు దేశం పార్టీ – జనసేన ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కమిటీ సభ్యులను నియమించిన ఇరు పార్టీలు.. వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించాయి. ఆ తర్వాత సమావేశమైన పవన్, లోకేష్ ప్రస్తుత రాజకీయాలు, ఉమ్మడి పోరాటానికి సంబంధించిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 1నుంచి ఉమ్మడిగా జనంలోకి వెళ్ళాలని నిర్ణయించారు.

టీడీపీ-జనసేన ఉమ్మడి ఎజెండాతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నవంబర్‌ 1 నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోతో ఒకటో తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు. ఓట్ల తొలగింపుతో సహా ప్రతి ప్రజా సమస్యపై ఇక నుంచి రెండు పార్టీలు కలిసే పోరాడాలే కార్యచరణ రూపొందించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నవంబర్ 3న విజయవాడలో మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ఫ్లాన్ చేశాయి రెండు పార్టీలు. ఈ సందర్భంగా ఉమ్మడిగా ఇంటింటి ప్రచారంపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు రెండు పార్టీల నేతలు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 100 రోజుల ప్రణాళిక రూపొందించింది టీడీపీ-జనసేన. వైసీపీ పోవాలి.. టీడీపీ-జనసేన రావాలి అనే నినాదంతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్తామని ఇదివరకే పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సంయుక్తంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నవంబర్‌ 1న ఉమ్మడి కార్యాచరణతో సిద్ధమవుతున్నారు. ఇకపై ఉమ్మడి వెళ్లే ఏ కార్యక్రమంలోనూ రెండు పార్టీలు సమన్వయం కలిసి వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే విజయవాడలో మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

ఇటు తెలుగు దేశం పార్టీతో కలిసి నడుస్తూనే భారతీయ జనతా పార్టీతో పొత్తుపైనా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎన్డీయేలోనే కొనసాగుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నందునే పొత్తు పెట్టుకున్నామని, దీనిపై బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని పవన్ క్లారిటీ ఇచ్చారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి మూడు పార్టీలు కలిసి వెళ్ళే అవకాశమున్నట్లు పవన్ మాటలను బట్టి అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలోనే మొదటి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ మీటింగ్‌లో మూడు తీర్మానాలు చేశాయి టీడీపీ, జనసేన. ఆంధ్రప్రదేశ్‌ను అరాచక పాలన నుంచి కాపాడడం, అన్ని వర్గాలకు అభివృద్ది అందించడం, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన తెలపడం. వీటిని ఉమ్మడి కార్యాచరణగా తీసుకెళ్లడానికి జిల్లాల స్థాయిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీలోని ఉమ్మడి జిల్లాల్లో అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో జరిగే సమావేశాలకు రెండు పార్టీల కార్యకర్తలు పాల్గొని, నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఆ తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. మ్యానిఫెస్టో ప్రకటించి, నవంబర్‌ 1 నుంచే ఇంటింటి ప్రచారం కూడా చేపడతామన్నారు. ఇక ప్రజా సమస్యలపై పోరులో భాగంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రాంతాల వారీగా నివేదిక తయారు చేయబోతున్నాయి రెండు పార్టీలు. మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణపై అధికార పార్టీ నుంచి గట్టి విమర్శలే వస్తున్నాయి. ఆ రెండు పార్టీల జాయింట్‌ యాక్షన్‌తో జగన్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు వైసీపీ నేతలు.

Andhra Pradesh: రాజధాని తరలింపా?.. అలా అని ఎవరు చెప్పారు?.. సీఎస్ జవహర్ రెడ్డి ఏమన్నారంటే..

విశాఖపట్నం, అక్టోబర్ 25: రాజధాని తరలింపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతోంది రాజధాని షిఫ్టింగ్ ఎంతమాత్రమూ కాదన్నారు. అసలు రాజధాని షిఫ్టింగ్ అని ఎవరు చెప్పారు? ఉత్తరాంధ్ర అభివృద్ది గురించి ఒక కమిటీ ని వేశాం, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయన్నారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.

కోస్టల్ సెక్యూరిటీ పై ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లో అపెక్స్ కమిటీ సమావేశం, అనంతరం పీఎం మోడీ నిర్వహించిన రాష్ట్రాల ప్రోగ్రెస్ కు సంబందించిన వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖ కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కే ఎస్ జవహర్ రెడ్డి ఆయా కార్యక్రమాల గురించి మీడియా కు వివరిస్తున్న క్రమంలో మీడియా తో మాట్లాడుతూ రాజధానికి సంబంధించి పై వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ది కి సంబందించిన ఏర్పాట్లు మాత్రమే..
జీవో నెంబర్ 2015 పేరుతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఏంటంటే రాష్ట్రంలోనే పూర్తిగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక ప్రాంతాలున్నాయి, ప్రధానంగా శ్రీకాకుళం విజయనగరం తో పాటు విశాఖ ఏజెన్సీలో మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందనీ గతంలో నీతి అయోగ్ వెనకబడిన జిల్లాలను ప్రతిపాదించిన సమయంలో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కొన్నాళ్లపాటు నిధులు కూడా విడుదలయ్యాయి. ఆ మేరకు అభివృద్ధి జరగకపోవడంతో ఉత్తరాంధ్ర అభివృద్ది మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అందుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.ఈ సమయాల్లో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు లేదంటే ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని, అలాగే ఆ సమయంలో అధికారిక పర్యటన కోసం వచ్చే కీలక ఉన్నత అధికారులకు సంబంధించిన కార్యాలయాలు, వాళ్లు నివాసం ఉండాలంటే అవసరమైతే వాటికి సంబంధించిన భవనాలు, ఇతర శాఖలకు సంబంధించిన ఎవరైనా ఈ ముఖ్యమైన అధికారులు ఈ ప్రాంతానికి వస్తే వాళ్లు ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన చర్యలపై త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆ జీ వో లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది.

ఆ కమిటీలో ముగ్గురు సీనియర్ అధికారులని సభ్యులుగా నియమించారు. పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, అలాగే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ని సభ్యులుగా నియమిస్తూ కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ ఓ విడత విశాఖ లో పర్యటించి, జిల్లా అధికారులతో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమయంలో ప్రధానంగా సీఎం ఇక్కడకు వస్తే ఉండడానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం తో పాటు దాదాపు 10 నుంచి 15 లక్షల చదరపు అడుగుల అధికారిక వ్యవహారాల స్పేస్, 1500 వరకు వివిధ రకాల నివాస గృహాలకు సంబందించిన సమాచారాన్ని కూడా జిల్లా యంత్రాంగం అందించింది.

ప్రస్తుతానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమే..
రాజధాని కి సంబందించిన న్యాయ వివాదాలు ప్రస్తుతం సుప్రీం కోర్టు లో పెండింగ్ లో ఉన్నాయి. ఈ వ్యాజ్యం పై డిసెంబర్ లో విచారణ, వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజధాని కి సంబందించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ ను మాత్రం షిఫ్ట్ చేసే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి రాష్ట్రం లో ఎక్కడైనా నివాసం ఉండొచ్చు.
ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే ఆయన కార్యాలయం అక్కడ నుంచి పాలించవచ్చు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పాలన చేయొచ్చు..ఈ వెసులుబాటు తోనే ఉత్తరాంధ్ర అభివృద్ది పేరుతో విశాఖ కు సీ ఎం వో ను షిఫ్ట్ చేసి విశాఖ తో పాటు అమరావతి లో కూడా ఉంటూ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ పాలన సాగించవచ్చు. అదే సమయంలో ఎన్నికల నాటికి రాజధాని విషయం లో కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి విశాఖ కు సీ ఎం వో ను షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర అభివృద్ది పేరుతో ఏర్పాటైన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17 నుంచి విశాఖ కు క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ చేసి, ఇక్కడనుంచి ముఖ్యమంత్రి పాలన సాగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లు రాజధాని మార్పుకు సంబంధించినవి ఎంత మాత్రం కాదంటూ సీ ఎస్ ఇచ్చిన వివరణ పై మరొకసారి రాష్ట్ర వ్యాప్త చర్చ కు తెరలేపినట్టైంది.

Actor Venkatesh: సైలెంట్‏గా వెంకటేశ్ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేష్ బాబు హాజరు.. ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కూతురు హయవాహిని నిశ్చితార్థం వేడుక బుధవారం ఘనంగా జరిగింది. వెంకటేశ్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి జరిగింది. ఓవైపు బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ఇక ఇప్పుడు రెండో అమ్మాయికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు వెంకీ. బుధవారం తన కూతురు నిశ్చితార్థ వేడుకను హైదరాబాద్‏లో చాలా సైలెంట్‏గా చేశారు. ఇరు కుటుంబసభ్యులు.. ఇండస్ట్రీకి చెందిన అతికొద్ది మంది ప్రముఖుల సమక్షంలో ఎంగెజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోస్ చూస్తుంటే.. వెంకీ కూతురి నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బబు హాజరయ్యి నూతన జంటను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. వెంకటేశ్ రెండో కూతురిని విజయవాడకు చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయి అని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో హయవాహిని వివాహం జరిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి నుంచి వెంకీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఇక తన సినిమాలు తప్ప.. ఫ్యామిలీ విషయాలు బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇక ఇప్పుడు తన కూతురి ఎంగజ్మెంట్ విషయం గురించి మీడియాకు తెలియకుండానే చూసుకున్నారు. అటు వెంకీ తనయులు కూడా సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు.

ఇక వెంకీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సైంధవ్ సినిమా చేస్తున్నాడు. తన కెరీర్ లో 75వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలకపాత్రలలో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది.

God OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ.. నయనతార ‘గాడ్‌’ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార నటించిన చిత్రం ఇరైవన్‌. కోలీవుడ్ స్టార్‌ హీరో జయం రవి మరో కీలక పాత్ర పోషించాడు. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా సెప్టెంబర్‌ 28 తమిళంలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో రెండు వారాల తర్వాత అంటే అక్టోబర్‌ 13న తెలుగులో కూడా విడుదలైంది. గాడ్‌గా విడుదలైన ఈ మూవీ ఇక్కడ కూడా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద బాగానే కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ గాడ్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ముందుగా నిర్ణయించిన టైమ్‌ ప్రకారం గురువారం (అక్టోబర్‌ 26) అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ గాడ్‌ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇక గాడ్‌ సినిమాలో నయన్‌, జయం రవి లతో వినోద్ కిషన్‌, రాహుల్ బోస్‌, విజయలక్ష్మి, నరైన్‌, ఆశిష్ విద్యార్థి,చార్లీ, అశ్విన్‌ కుమార్‌, భగవత్ పెరుమాల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. సిటీలో ఒక సైకో కిల్లర్ (రాహుల్ బోస్) అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి అతి క్రూరంగా చంపేస్తుంటాడు. అతనిని ఐపీఎస్‌ ఆఫీసర్‌ అర్జున్‌ (జయం రవి), స్నేహితుడు (నరైన్‌) కలిసి పట్టుకుంటారు. అయితే ఈ క్రమంలో నరైన్‌ చనిపోతాడు. దీనికి తోడు ఆ కిల్లర్‌ను పట్టుకున్న తర్వాత కూడా వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. మరి అసలు వాళ్లని చంపేది ఎవరు? ఎందుకు ఇలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? ప్రియ (నయనతార) పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే గాడ్‌ సినిమా చూడాల్సిందే. థియేటర్లలో ఈ సైకో థ్రిల్లర్‌ మూవీని మిస్‌ అయిన వారికి ఈ మూవీ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

Ranveer Singh – Deepika Padukone: దీపికా, రణవీర్‏ పెళ్లి వీడియో చూసి కరణ్ ఎమోషనల్.. పెళ్లైన 5 ఏళ్లకు బయటకు వచ్చింది..

పెళ్లి చేసుకున్న ఐదు సంవత్సరాల తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, హీరో రణవీర్ సింగ్ వెడ్డింగ్ వీడియో బయటకు వచ్చింది. ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్ 8’ మొదటి ఎపిసోడ్‌లో తమ వివాహ వీడియోను పంచుకున్నారు ఈ లవబుల్ కపూల్. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ‘కాఫీ విత్ కరణ్’ షోకు వీరిద్దరి అతిథులుగా హజరయ్యారు. గతంలో వీరు విడి విడిగా ఈ షోకు వెళ్లారు. కానీ మొదటిసారి ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. తమ ప్రేమ, పెళ్లి, దీపికా ఇంటి సభ్యులను రణ్వీర్ ఎలా ఒప్పించాడు అనే విషయాలను ఆ వీడియోలో వెల్లడించారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘దీప్‌వీర్’ పెళ్లి వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది.దీపికా పదుకొణె నటించిన ‘యే జవానీ హై దీవానీ’లో వెడ్డింగ్ సీక్వెన్స్‌ని షూట్ చేసిన అదే టీమ్ ది వెడ్డింగ్ ఫిల్మర్స్ వెడ్డింగ్ వీడియోను క్యాప్చర్ చేసింది.

రణవీర్ తన పెళ్లిలో టోస్ట్ ఇవ్వడంతో వీడియో ప్రారంభమైంది. దీపికా పదుకొణెని పెళ్లి చేసుకుంటానని తాను ఒకసారి చెప్పానని, చివరకు ఆ రోజు వచ్చిందని వెల్లడించాడు. ‘దీప్‌వీర్’ కలిసిన అందమైన క్షణాల నుంచి.. రణవీర్, దీపికను పెళ్లి చేసుకోవడం గురించి ఆమె ఇంట్లో వారిని ఎలా ఒప్పించాడు.. చివరకు వీరి వివాహం ఎలా జరిగిందనే క్షణాలను ఆ వీడియోలో బంధించారు. దీపికా తండ్రి మాజీ బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాష్ పదుకొణె తమ నలుగురితో కూడిన ‘బోరింగ్’ కుటుంబానికి రణవీర్ కొంత ఉత్సాహాన్ని తెస్తున్నాడని వీడియోలో తెలిపారు.

సరస్సు దగ్గర జరిగిన మెహందీ వేడుకలో రణ్‌వీర్ డ్యాన్స్, దీపిక పెళ్లికి సిద్ధమవుతూ.. మండపం వద్ద ఈ జంట ప్రతిజ్ఞలు చేసుకోవడం, వారి ఆనంద్ కరాజ్ వేడుక.. ఇలా అన్నీ వీడియోలో బంధించబడ్డాయి. అంతే కాదు, రణవీర్ పెళ్లికి ముందు తన భార్యను చూడటానికి దీపికా గది బయట వేచి ఉండడం.. ఆ తర్వాత “లవ్ యు బేబీ” అని చెప్పడం కనిపిస్తోంది.

అయితే దీప్ వీర్ పెళ్లి వీడియో చూసిన కరణ్ భావోద్వేగానికి గురయ్యాడు. “ పెళ్లి వీడియో చూడడం.. ఒకరిపై మరొకరు ప్రేమను పంచుకోవడం చూడడం చాలా సంతోషంగా ఉంది. కానీ నేను బంధంలో లేను..ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉండటం వల్ల నేను ఏమి కోల్పోతున్నానో నాకు తెలుస్తోంది. జీవితంలోని విషయాలను పంచుకోవడానికి నాకు సొంత భాగస్వామి లేరు. ప్రతిరోజూ కోల్పోతున్నాను. నాలో కొంత భాగం శూన్యంగా కనిపిస్తోంది. నాకు నా పిల్లలు, అమ్మ ఉన్నారు. సంబంధాలు ఎంత కఠినంగా ఉంటాయని నాకు తెలుసు, కానీ ఒక వ్యక్తితో ఉన్న ఆత్మ సంబంధాన్ని మీరు వారి చేయి పట్టుకుని మేల్కొలపవచ్చు. కష్ట సమయాల్లో మీరు తోడును చూడవచ్చు.” అంటూ భావోద్వాగానికి గురయ్యాడు కరణ్. దీంతో అతడిని ఓదారుస్తూ.. సరైన సమయంలో మీకు సరైన వ్యక్తి దొరుకుతారంటూ దీపికా హామీ ఇచ్చింది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్‌లు స్ట్రీమింగ్ అవుతాయి.

బాలీవుడ్ జడ్జిలను ఫిదా చేసిన హైదరాబాద్ కుర్రాడు.. అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ అదరగొట్టేశాడు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ర్యాప్ సాంగ్ తెగ వైరలవుతుంది. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు ఓ కుర్రాడు ర్యాప్ సాంగ్ అదరగొట్టేస్తోన్న వీడియో హల్చల్ చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ టీవీ ఛానల్‏లో నిర్వహించిన మ్యూజిక్ షోలో హైదరాబాద్ గురించి చెప్తూనే సౌత్ యాక్టర్స్ అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ ఆలపించాడు. ఆ కుర్రాడి పాటకు బీటౌన్ జడ్జీలు ఫిదా కాగా.. అక్కడున్న అడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఆ యువకుడు హైదరాబాద్‏కు చెందిన రేపర్ కేదెన్ శర్మ. ఎంటీవీ హాస్టిల్ సీజన్ 3లో తన ఫర్ఫార్మెన్స్‏తో దుమ్మరేపాడు. 23 ఏళ్ల ఈ హైదరాబాదీ రేపర్.. ‘హైదరాబాద్ షెహర్ కా మే స్ట్రీట్ సెలబ్రిటీ.. ఓల్డ్ సిటీ కీ స్లాండ్ దేఖే ఆయా ఎంటీవీ’ అంటూ స్టేజ్ ని కిక్కెక్కించాడు. హైదరాబాద్ కల్చర్, నగరం గొప్పతనాన్ని.. ఇక్కడి వీధుల్లో చిరు వ్యాపారుల రోజు వారీ జీవితాన్ని తెలియజేస్తూ పాటను స్టార్ట్ చేశాడు.

‘పాట మధ్యలోనే మజా రావడం లేదా.. ఇప్పుడు వస్తుంది చూడండి.. అంటూ అల్లు అర్జున్ డాన్స్ అంటే అందరికీ ఇష్టం.. స్టైల్ స్టార్ అందరూ అతని.. తగ్గేదే లే మేము పుష్ప ఫ్యాన్స్’ అంటూ లిరిక్స్ తో ఓ ఊపు ఉపేసాడు. ఆ తర్వాత వెంటనే సాయి పల్లవి గురించి ప్రస్తావిస్తూ.. ‘అందాలు ఆరబోసే హీరోయిన్స్ ఉంటారు.. కానీ సాయిపల్లవి సింప్లిసిటీ, పాపులారిటీ ఎవరికీ రాదు.. తెలుగులో ఉన్నది 70 మిలియన్ జనాలు..కానీ ఆమె రౌడీ బేబీ పాటకు బిలియన్ వ్యూస్ వచ్చే క్రేజ్ ఆమెది’అంటూ ర్యాప్ సాంగ్ అదరగొట్టేశాడు. ఇక అదే పాటలో హైదరాబాద్ లోని పాపులర్ ప్లేసెస్, సౌత్ మూవీస్ గొప్పతనం గురించి ప్రస్తావించడంతో జడ్జీలు ఫిదా అయ్యారు.

కేదెన్ శర్మ ర్యాప్ సాంగ్ వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇక అతనికి సంబంధించిన వీడియోను సీపీ ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలోక షేర్ చేస్తూ.. ఎంటీవీలో ప్రసారమైన ఈ షోను చూసి ఎంజాయ్ చేయండంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం కేదెన్ శర్మ ర్యాప్ సాంగ్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.

1 6 7 8 9 10 22