CM Jagan Photo In Voter List : అధికారులు ఇదేం పని..! ఓటర్ల జాబితాలో తప్పులు.. మహిళ స్థానంలో జగన్ ఫొటో

AP CM Jagan Photo : ఏపీలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అధికారుల తప్పిదంతో ఓటర్ లిస్టులో మహిళ ఫొటో స్థానంలో ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటో వచ్చింది. ఓటర్ల జాబితాలో పేర్లును చెక్ చేసుకొనే సమయంలో సీఎం ఫొటోను చూసి సదరు మహిళతోపాటు స్థానికులు కంగుతిన్నారు. మహిళ ఫొటో ఉండాల్సిన ప్లేస్ లో అధికారులు ఏకంగా సీఎం జగన్ ఫొటో పెట్టడం అధికారుల పనితీరుకు అద్దంపడుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దొర్నాల మండలం వై చెర్లోపల్లి గ్రామ ఓటరు లిస్టులో ఈ తప్పిదం జరిగింది. గ్రామంకు చెందిన జనపతి గురవమ్మ అనే మహిళా ఓటర్ ఫొటో ఉండాల్సిన స్థానంలో జగన్ ఫొటోను అధికారులు ముద్రించారు. గురవమ్మ ఓటర్ లిస్ట్ చూసుకునే సమయంలో తన పేరు వద్ద జగన్ ఫొటో ఉండటాన్నిచూసి కంగుతింది. తన ఫొటో కాకుండా జగన్ ఫొటో రావడం ఏమిటని అధికారులను ప్రశ్నించింది. ఈ విషయంపై అధికారులను స్థానికులు ప్రశ్నించగా.. బీఎల్వో తప్పిదంతోనే ఇలా జరిగి ఉంటుందని చెప్పారని స్థానికులు పేర్కొన్నారు.

అయితే, ఇదే గ్రామంలో మరికొందరు ఫొటోల స్థానంలో ఏకంగా ఆధార్ కార్డు అప్ లోడ్ అయిందని స్థానికులు తెలిపారు. ఓటర్ లిస్టులో ఇలా తప్పులతడక ఉంటే ఎలా అని, అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. మరోవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నాయి.

Girl Killed : ప్రేమ పెళ్లి చేసుకుంటానన్న యువతిని హత్య చేసిన తల్లి, అన్న

Anantapur Girl Killed : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుంటానన్న యువతిని తల్లి, అన్న కలిసి హత్య చేశారు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానంటున్న యువతిని ఆమె తల్లి, అన్న కలిసి చంపేశారు.

గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో కోమల(17) అనే బాలిక పెద్దలు చూసిన సంబంధం కాకుండా నచ్చిన వాడిని చేసుకుంటానంటూ కుటుంబ సభ్యులతో గొడవ పడింది. కుమార్తె పెళ్లి చేసే విషయంలో కుటుంబ సభ్యల మధ్య గొడవ జరిగింది. బాలిక పెళ్లి సంబంధం వివాదం హత్యకు దారి తీసింది.

కోమలను తల్లి, సోదరుడు చితకబాది, ఆపై ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. కూతురును చంపిన అనంతరం పోలీస్ స్టేషన్ లో తల్లి, సోదరుడు లొంగిపోయారుు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పవన్ లేకుండానే టీడీపీ-జనసేన సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టోపై క్లారిటీ వచ్చే అవకాశం..

తెలుగుదేశం-జ‌న‌సేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండ‌బోతుంది.? రెండు పార్టీలు క‌లిసి క్షేత్రస్థాయిలో పోరాటాలు ఎలా చేస్తాయి. ఇదంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల్లో ఆస‌క్తిగా మారింది. టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదిరి రోజులు గ‌డిచిపోతుంది. అయినా ఉమ్మడి పోరాటాల‌పై మాత్రం స్పష్టత రావడం లేదు. రెండు పార్టీలు క‌లిసి ఎలా ముందుకెళ్లాల‌నే దానిపై ఉమ్మడి కార్యాచ‌ర‌ణ క‌మిటీ ఏర్పాటు చేసాయి. ఈ క‌మిటీ మొద‌టిసారి రాజ‌మండ్రిలో స‌మావేశ‌మైంది. ప్రభుత్వంపై ఆందోళ‌న‌ల కంటే రెండు పార్టీల క‌ల‌యిక‌పైనే ముందుగా దృష్టి పెట్టాయి. రాష్ట్ర స్థాయిలో జ‌రిగిన స‌మావేశానికి నారా లోకేష్‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రై క్యాడర్‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇక ఆ త‌ర్వాత జిల్లా స్థాయిలో స‌మ‌న్వయ స‌మావేశాలు జ‌రిగాయి. రెండు పార్టీల మ‌ధ్య ఎలాంటి పొర‌ప‌చ్చాలు లేకుండా క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగడంపైనే చ‌ర్చించాయి. ఒక‌రకంగా చెప్పాలంటే ఈ సమావేశాలు క్యాడర్ మ‌ధ్య క‌ల‌యిక కోసం ఏర్పాటు చేసిన‌వే. ముఖ్యంగా పొత్తు వ‌ల్ల రెండు పార్టీల నాయ‌కుల్లో గానీ కార్యక‌ర్తల్లో గానీ మ‌న‌స్పర్ధలు లేకుండా ముందుకెళ్లేలా ఈ స‌మావేశాలు నిర్వహించారు. మ‌రోవైపు ఓటు బ‌ద‌లాయింపుపైనా స‌మ‌న్వయ స‌మావేశాల్లో చర్చించారు. రెండు పార్టీల ఓట్లు ఇత‌ర పార్టీల‌కు మ‌ళ్లకుండా ఉమ్మడి అభ్యర్ధికే ఖ‌చ్చితంగా వేసేలా చూడాల‌ని స‌మావేశంలో అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తంగా రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో జ‌రిగిన సమావేశాల్లో ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేకుండా క‌లిసిక‌ట్టుగా సాగ‌డంపైనే చ‌ర్చించాయి. తాజాగా న‌వంబ‌ర్ తొమ్మిదో తేదీన మ‌రోసారి రాష్ట్ర జేఏసీ స‌మావేశం అవుతుంది. ఈ స‌మావేశంలో అన్ని అంశాల‌పై క్లారిటీ ఇచ్చే దిశ‌గా రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి.
ఉమ్మడి స‌మావేశంలో మేనిఫెస్టోపై క్లారిటీ ఇచ్చే దిశ‌గా టీడీపీ-జన‌సేన‌..
ఈ నెల తొమ్మిదో తేదీని టీడీపీ-జ‌న‌సేన ఉమ్మడి స‌మావేశం విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నుంది. ముందుగా ఈ స‌మావేశాన్ని మంగ‌ళగిరిలోని టీడీపీ కార్యాల‌యంలో జ‌ర‌పాల‌ని నిర్ణయించినప్పటికీ వేదిక‌ను విజ‌య‌వాడ‌కు మార్చారు. ఓ ప్రయివేట్ హోట‌ల్‌లో జరిగే ఈ స‌మావేశానికి నారా లోకేష్‌తో పాటు జేఏసీలోని 12 మంది స‌భ్యులు హాజ‌రుకానున్నారు. అయితే జ‌న‌సేన నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ స‌మావేశానికి హాజ‌రుకావ‌డం లేదు. ఈ స‌మావేశంలో కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. గ‌త స‌మావేశంలో మేనిఫెస్టోపై ప‌వ‌న్ క‌ళ్యాణ్-నారా లోకేష్ చ‌ర్చించారు. ఆ త‌ర్వాత ఇటీవ‌ల చంద్రబాబుతో భేటీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా మేనిఫెస్టో విడుద‌ల‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చించారు. దీనికి కొన‌సాగింపుగా గురువారం జ‌రిగే స‌మావేశంలో మేనిఫెస్టోకు తుదిరూపు తీసుకురానున్నారు. ఇప్పటికే సూప‌ర్ సిక్స్ పేరిట తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది. ఇది ప్రిలిమిన‌రీ మేనిఫెస్టో మాత్రమే..వాస్తవంగా విజ‌య‌ద‌శ‌మి రోజు పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల చేస్తామ‌ని చంద్రబాబు అరెస్ట్‌కు ముందు ప్రక‌టించారు. అది వాయిదా ప‌డింది. సూప‌ర్ సిక్స్‌తో పాటు మ‌రికొన్ని అంశాల‌తో టీడీపీ ప్రతిపాద‌న‌లు సిద్దం చేసింది. అటు జ‌న‌సేన కూడా ష‌ణ్ముక వ్యూహం పేరుతో రెండేళ్ల క్రితం ప్రక‌టించిన అంశాల‌న్నీ మేనిఫెస్టోలో పొందుప‌రిచేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్లు స‌మాచారం. రెండు పార్టీల నుంచి ఉన్న ప్రతిపాద‌న‌ల‌పై చ‌ర్చించిన త‌ర్వాత మేనిఫెస్టోపై ఓ స్పష్టత‌కు రానున్నట్లు తెలిసింది. త్వర‌లో పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల దిశ‌గా రెండు పార్టీలు సిద్దమ‌వుతున్నాయి. ఇక గురువారం జ‌రిగే స‌మావేశంలో రైతుల స‌మ‌స్యల‌పై కూడా చ‌ర్చించ‌నున్నారు. రాష్ట్రంలో నెల‌కొన్న క‌రువు, రైతుల‌ను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నట్లు తెలిసింది.
దీపావ‌ళి త‌ర్వాత ఉమ్మడి పోరాటాల‌కు సిద్దమ‌వుతున్న రెండు పార్టీలు..
తొమ్మిదో తేదీ ఉమ్మడి స‌మావేశంలో తీసుకునే నిర్ణయాల‌పై మ‌రోసారి చంద్రబాబు-ప‌వ‌న్ భేటీలో చ‌ర్చిస్తారు. దీపావ‌ళి త‌ర్వాత మ‌రోసారి ఇద్దరు నేత‌లు స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలోనే మేనిఫెస్టో విడుద‌ల‌కు తేదీని ఖ‌రారు చేయ‌నున్నారు. మ‌రోవైపు ఉమ్మడి పోరాటాల‌కు కూడా దీపావ‌ళి త‌ర్వాత ప్రత్యేక షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. చంద్రబాబు-ప‌వ‌న్ భేటీ కంటే ముందుగానే జేఏసీ నేత‌లు తాత్కాలిక షెడ్యూల్, మేనిఫెస్టోల‌కు తుదిరూపు తీసుకురానున్నారు. మొత్తానికి వ‌చ్చే వారం నుంచి దూకుడు పెంచేలా టీడీపీ-జ‌న‌సేన ప్రణాళిక‌తో ముందుకెళ్తున్నాయి.

‘దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు’.. పురందేశ్వరిపై మండిపడుతోన్న వైసీపీ నేతలు..

పురందేశ్వరి రాసిన బెయిల్ రద్దు లేఖ ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఆమె తీరుపై వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె ఏ పార్టీలో ఉన్నారు.. ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఆమె కళ్లకు కనిపించడం లేదా అంటూ నిలదీస్తోంది వైసీపీ.
సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీజేఐకి పురందేశ్వరి లేఖరాయడం పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతోంది వైసీపీ. ఆమెకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలి పదవి పార్టీకి సేవ చేసేందుకా.. లేక టీడీపీ అధినేతగా ఉన్న బావకు సేవ చేసేందుకా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. పురందేశ్వరికి డబ్బు వ్యామోహం తప్ప.. దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు. పురంధేశ్వరి దృష్టంతా పైరవీలు, సంపాదనపైనే ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి.
పురందేశ్వరికి నీతి, నిజాయితీ ఉంటే..చంద్రబాబు స్కాంలపై CBI విచారణ కోసం లేఖ రాయాలని డిమాండ్ చేశారు మంత్రి రోజా. NTR పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తూ.. చంద్రబాబు స్క్రిప్ట్‌ను పురంధేశ్వరి చదువుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌పై దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ అధ్యక్షురాలిగా కనీసం పది ఊర్లు కూడా పురందేశ్వరి తిరగలేదు. కానీ టీడీపీని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచిస్తోందని ఆరోపించారు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.
పురందేశ్వరికి పదవులు, డబ్బు పైనే ఆశ తప్ప పార్టీ గురించి ఏమాత్రం ఆలోచన లేదని ఆరోపిస్తోంది వైసీపీ. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతాలను కాదని టీడీపీకి భుజం కాస్తోందనీ.. బీజేపీని టీడీపీలో విలీనం చేసే స్థాయికి తీసుకొచ్చిందనేది వైసీపీ ఆరోపణ. పార్టీకి ద్రోహం చేస్తున్న పురందేశ్వరిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.

Vijayawada Bus Accident: గేర్‌ తప్పుగా మార్చడంతోనే ప్రమాదం.. విజయవాడ ఘటనలో ముగ్గురిపై చర్యలు

Vijayawada Bus Accident: విజయవాడ బస్టాండ్‌లోకి బస్సు దూసుకెళ్లి.. ముగ్గురు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్‌ ప్రకాశం సహా మరో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తూ ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. బస్సు డ్రైవర్‌ ప్రకాశం తప్పుగా గేర్‌ ఎంచుకోవడం వల్లే బస్సు బస్టాండ్‌లోకి దూసుకెళ్లిందని నివేదికలో పేర్కొన్నారు. దాంతో డ్రైవర్‌ ప్రకాశంపై సస్పెన్షన్‌ వేటు వేశారు. విధుల పర్యవేక్షణలో ఆటోనగర్‌ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ వి.వి.లక్ష్మి విఫలమయ్యారని నిర్ధరించారు. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టం ఉన్న బస్సుకు పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న డ్రైవర్లను పంపాల్సి ఉంది. కానీ.. అలా చేయకుండా సూపర్‌ లగ్జరీ బస్సులను నడిపిన డ్రైవర్‌ ప్రకాశాన్ని పంపారని కమిటీ తేల్చింది. కానీ.. డ్రైవర్‌కు ముందస్తుగా.. సమగ్ర శిక్షణ ఇవ్వలేదని నిర్ధారించారు. అందుకు.. ఆటోనగర్ అసిస్టెంట్ డిపో మేనేజర్ వి.వి లక్ష్మి బాధ్యతారాహిత్యమే కారణమని తెలుపుతూ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారాలను సమగ్రంగా పర్యవేక్షించాల్సిన ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ విఫలమయ్యారని కమిటీ తేల్చింది. ఆయనపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రెండు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్ లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కండక్టర్ వీరయ్య, కుమారి, చిన్నారి అయాన్స్ గా గుర్తించారు. మృతుల కటుంబ సభ్యులకు ఆర్టీసీ 5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 10 లక్షలు ప్రకటించారు.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. బస్సు ప్రమాదంతో ఆర్టీసీ డిపార్ట్‌మెంట్‌ కూడా ఉలిక్కిపడింది. వెంటనే ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేసిన ఆర్టీసీ కమిటీ.. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో.. దాని ఆధారంగా ఆర్టీసీ అధికారులు ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. గురువారం తులం గోల్డ్ ఎంతకు చేరిందంటే..

దేశంలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. రోజురోజుకీ ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం తులం బంగారంపై రూ. 200 వరకు పెరగగా ఈరోజు (గురువారం) కూడా గోల్డ్‌ ధర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి, రూ. 61,800కి చేరింది. ఇక దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690వద్ద కొనసాగుతోంది.

* ముంబయిలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 వద్ద కొనసాగుతోంది.

* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800గా ఉంది.

* ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.61,800గా ఉంది.

* ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. గురువారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది. ఒఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 77,500గా నమోదైంది.
* ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఫోన్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడమే. 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయి.

ఒక్క షేక్‌హ్యాండ్‌.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.. పవన్, నాని కలయిక వెనుక ఇంత అర్ధముందా?

ఒక్క షేక్‌హ్యాండ్‌.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ముఖ్యంగా గుడివాడలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బద్ద శత్రువుల్లాంటి ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఇలా హ్యాపీగా నవ్వుతూ కరచాలనం చేసుకోవడం చాలామందిని అర్ధం కాట్లేదు. అటూ.. ఇటూ.. వార్‌ అయితే కంటిన్యూ అవుతోంది. ఒక పెళ్ళి వేడుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది.

వంగవీటి రాధా పెళ్లి.. సరికొత్త చర్చకు దారి తీసింది. ఆయన పెళ్లికి హాజరైన సమయంలో కనిపించిన సీన్స్‌ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మాజీ మంత్రి,. వైసీపీ నేత కొడాలినాని.. ఈ ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం.. పైగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు ఇలా మెలగడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపిచింది కూడా. అయితే గుడివాడలో మాత్రం పొలిటికల్‌గా దుమారం రేగింది. మాజీ మంత్రి కొడాలిపై టీడీపీ, జనసేన నేతలు మండిపడ్డారు. కేవలం పవన్‌తో కరచాలనం కోసం.. నాని ఎంతకు దిగజారారో అంతా చూశారని ఆరోపించారు నేతలు. పవన్‌ చుట్టూ అభిమానులున్నా.. కొడాలి నాని మాత్రం వారిని తోసుకుంటూ వెళ్లి పవన్‌తో చెయ్యి కలిపారని మండిపడ్డారు.

అయితే వంగవీటి రాధా పెళ్లికి వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు. తనకు సన్నిహితులైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పెళ్లికి పిలిచారు. అంతేకాదు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కొడాలి నాని.. అప్పటికే పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆయన వంగవీటి రాధాను కంగ్రాట్స్‌ చెప్పేందుకు స్టేజ్‌ ఎక్కేలోపే పవన్‌ కల్యాణ్‌ రావడం జరిగింది. ఇద్దరూ ఎదురెదురుగా రావడంతో.. ముందు కొడాలి నాని నమస్కారం చేశారు.. అది చూసి పవన్‌ ప్రతి నమస్కారం చేసి.. కరచాలనం కోసం చేయి ఇచ్చారు. దీంతో నాని కూడా ముందుకు కదిలి చేయి కలిపారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అటు జనసేన వారు పవన్‌తో షేక్‌ హ్యాండ్‌ కోసం నాని ఎగబడ్డారంటే.. నానితో పరిచయం కోసం పవన్‌ చేయి ఇచ్చారంటూ ఎవరికి నచ్చిన పోస్టులు వారు పెడుతున్నారు.

అయితే పెళ్లికి వచ్చిన అతిథులు ఎదురుపడితే ఇలా నమస్కరించుకుని.. షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం కనీస సంస్కారం అంటూ మరికొందరు స్పందించారు. తెలుగు దేశం పార్టీ – జనసేన పార్టీలు మాత్రం కొడాలి నాని టార్గెట్‌ గానే ఆరోపణలు చేస్తున్నాయి. అసలు కొడాలి ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలంటూ జనసేన అంటోంది. రెండు బస్సులతో రెండు కోట్ల బెంజ్‌ కారు ఎలా కొన్నావంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

AP Politics: ఏపీలో హీటెక్కిన రాజకీయాలు.. పోటా పోటీ యాత్రలతో జనంలోకి వైసీపీ, టీడీపీ

ఆరు నెలల్లో ఎన్నికలు జరగునున్న ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నాలుగున్నరేళ్లలో చేసిన సంక్షేమం-అభివృద్ధి ఎజెండాగా మరోసారి ప్రజల్లోకి వెళ్తుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ప్రతిపక్ష తెలుగు దేశం, జనసేన పార్టీలు పోటా పోటీ యాత్రలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆయన భార్య భువనేశ్వరి జనం మద్యలోకి వచ్చారు.

సామాజిక సాధికార యాత్ర ద్వారా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోనే ఉన్న వైసీపీ కేడర్, తాజాగా ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర చేపడుతోంది. అక్టోబర్ 26 నుంచి 60 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్రలు కొనసాగనున్నాయి. ఒక్కో రోజు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని మూడు ప్రాంతాల్లో మూడు నియోజకవర్గాల్లో యాత్రలు జరగనున్నాయి. మద్యాహ్నం ఒంటి గంట నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

వైసీపీ సామాజిక సాధికార యాత్రకు సంబంధించి షెడ్యూల్ పార్టీ వర్గాలు విడుదల చేశాయి. అయా నియోజకవర్గాల్లో ముందుగా ఎంపిక చేసిన సచివాలయాన్ని వైసీపీ నేతలు సందర్శిస్తారు. ఇక్కడే ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్లు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, స్థానికంగా ఎంపిక చేసిన 200 మందితో కలిసి సహాపంక్తి భోజనం చేస్తారు. తర్వాత మీడియా సమావేశం ఉంటుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సామాజిక సాధికారత,గత ప్రభుత్వం పేదల విషయంలో వ్యవహారించిన తీరును ప్రజలకు వివరించనున్నారు. బస్సు యాత్ర వెళ్లే మార్గంలో ముందుగా నిర్ణయించిన చోట్ల ప్రజలతో మమేకం అవుతారు. అదే రోజు సాయంత్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తారు. సామాజిక సాధికార యాత్ర లో భాగంగా బస్సు పైనుంచే ప్రజల నుద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రసంగించనున్నారు. అక్టోబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సామాజిక సాధికార యాత్ర ను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రులు,ఇతర నేతలు లాంఛనంగా ప్రారంభించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పైనే స్పెషల్ ఫోకస్
సామాజిక సాధికార యాత్ర… పేరుకు తగ్గట్లుగానే బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేసింది వైసీపీ. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏవిధంగా ప్రాధాన్యత ఇచ్చిందో, ప్రజలకు వివరించడమే యాత్ర లక్ష్యంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. కేబినెట్‌తో పాటు ఇతర పదవుల్లోనూ భారీగా కేటాయింపులు చేయడం, ఆయా వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రను ఉపయోగించుకొనున్నారు వైసీపీ నేతలు. బస్సు యాత్రలో పేదలు పాల్గొనేలా చూడాలని సీఎం జగన్ ఇప్పటికే నేతలకు సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పేదలకు-పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతుందనే నినాదాన్ని బస్సు యాత్ర ద్వారా బలంగా తీసుకెళ్లాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో వైసీపీ నేతలు క్లాస్ వార్ స్లోగన్‌తో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లేదంటే సమన్వయకర్తలు అధ్యక్షతన బస్సు యాత్ర జరగనుంది. ప్రతి బస్సులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు తప్పకుండా ఉండేలా ప్లాన్ చేశారు. సభలు ఎలా జరగాలి. ఎలాంటి అంశాలతో ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే రీజినల్ కోఆర్డినేటర్లు సమావేశాలు పెట్టి వివరించారు. మొదటి విడతలో నవంబర్ 9 వ తేదీ వరకూ ఒక్కో రోజు మూడు ప్రాంతాల్లో యాత్రలు సాగనున్నాయి.
బస్సు యాత్ర మొదటి విడత షెడ్యూల్ రిలీజ్ చేసిన వైసీపీ
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వ తేదీ వరకూ మొదటి విడత సామాజిక సాధికార యాత్ర లు జరగనున్నాయి. దీనికి సంబందించిన పోస్టర్ ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు విడుదల చేశారు. మొదటి రోజు ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమ లో సింగనమలలో యాత్రలు జరగనున్నాయి. మొదటి విడతలో 39 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కోనసాగనుంది.
జనంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి
మరోవైపు స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టై జైల్లో ఉండటంతో ఇప్పుడు ఆయన భార్య భువనేశ్వరి జనం మద్యలోకి వచ్చారు. చేయి చేయి కలిపి పోరాటం చేద్దామని ప్రజలకు భువనేశ్వరి పిలుపినిచ్చారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె నుంచి యాత్రను ఆమె ప్రారంభించారు. తండ్రి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి, నిజం గెలవాలికి భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. ఆమె వెంట చిత్తూరు, తిరుపతి జిల్లాల టీడీపీ నేతలతో పాటు ఎమ్మెల్సీ అనురాధ, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు.
నిజం గెలవాలి యాత్రలో పరామర్శలు..
నిజం గెలవాలి యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టు వార్త విని ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. చంద్రగిరిలో మరణించిన ప్రవీణ్‌రెడ్డి, నేండ్రగుంటలో కన్నుమూసిన చిన్నబాబు కుటుంబాన్ని భువనేశ్వరి ఓదార్చారు. వారి కుటుంబాలకు 3 లక్షల చెక్కు అందజేశారు. కష్టకాలంలో అండగా ఉన్న ప్రతీ ఒక్కరి బాధ్యత పార్టీ తీసుకుంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. పరామర్శ తర్వాత చంద్రగిరిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు, రాజకీయాలు చేసేందుకు తాను రాలేదని భువనేశ్వరి అన్నారు. తానెప్పుడు ఇలా బయటకు రాలేదని తెలిపారు. నిజం గెలవాలన్నది ఒక పోరాటమని తెలిపారు.

అక్షయపాత్రలు విందు భోజనాలు.. రాజకీయ ప్రముఖులు, సీఎం రాక.. అదిరిపోయేలా రిసెప్షన్‌

పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవి అంత చాపలు పరిచేసి కోట్లు ఖర్చు కుమ్మరిస్తారు. విందు, చుట్టాలు, వందలాది కాదు వేలాది మందికి భోజనాలు వైభవంగా జరిపిస్తారు. కానీ..ఇక్కడ జరిగేది రిసెప్షన్‌ మాత్రమే..పెళ్లికి మించి ఏర్పాట్లు చేస్తున్నారు. పాతిక ఎకరాల విస్తీర్ణం.. 11 షెడ్డులు.. పదుల సంఖ్యలో వంట మాస్టర్లు.. 30 టీమ్‌లు.. 28 రకాల వంటలు.. ఇంతకీ ఎక్కడ?

తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం గోదావరి తీరాన అతిపెద్ద వేడుక జరగబోతోంది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్‌ వివాహ రిసెప్షన్‌ అంగరంగ వైభవంగా నిర్వహించేంందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్‌ వివాహ రిసెప్షన్‌ను రాజమండ్రి దివాన్‌ చెరువు డీవీబీ రాజు లేఔట్‌లో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేశారు. వివాహానికి లక్షలాది మందిని ఆహ్వానిస్తున్నారు. సుమారు మూడు లక్షల మందికి పైగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. 28 రకాల కాయగూరాలతో పసందైన విందు భోజనాన్ని జక్కంపూడి కుటుంబీకులు ఏర్పాటు చేస్తున్నారు.

డోలు, సన్నాయి వాయిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి వివాహ విందుకు రావాలని ఆహ్వానపత్రిక అందిస్తున్నారు జక్కంపూడి కుటుంబీకులు, వారి అభిమానులు. ఒక్క రాజమండ్రే కాదు…తూర్పు గోదావరిజిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి పలువురు స్థానికులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను ఆహ్వానించారు. వివాహ ఏర్పాట్లను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన అభిమానులు దగ్గరుండి అన్నీ ఏర్పాట్లు చూస్తున్నారు. గోదావరి తీరాన ఇంత పెద్ద వేడుక జరగడం ఇదే మొదటిసారని జక్కంపూడి అభిమానులు అంటున్నారు.

మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా జక్కంపూడి వారి వివాహ విందుకు హాజరవుతున్నారు. ఈ మేర‌కు అధికారులు సీఎం ప‌ర్యటన‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఉదయం 10.15 గంటలకు సీఎం జ‌గ‌న్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువు చేరుకుంటారు. అక్కడ డీబీవీ రాజు లే–అవుట్‌లో జరగనున్న విజయ్‌ గణేష్‌ మోహన్‌ వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. ముఖ్యమంత్రి వస్తుండటంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఇక ఈ వేడకకు తూర్పుగోదావరి జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి స్థానికులు, సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు రానున్నారు. అధిక సంఖ్యలో అతిథులు నియోజకవర్గం, వివిధ జిల్లాల వస్తుండటంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్రావు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమందికి గుర్తింపు ఉండడంతో.. ఆయనతో అనుబంధం ఉన్నా ప్రతిఒక్కరిని ఈ రిసెప్షన్ కీ ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. జక్కంపూడి వారు ఇచ్చే విందునతో పాటు వినోదాన్ని పంచే విదంగా పిల్లలకోసం ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు.

వచ్చే నెల 3న మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం.. ఏం చెప్పబోతున్నారంటే?

లుగు దేశం పార్టీ – జనసేన ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కమిటీ సభ్యులను నియమించిన ఇరు పార్టీలు.. వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించాయి. ఆ తర్వాత సమావేశమైన పవన్, లోకేష్ ప్రస్తుత రాజకీయాలు, ఉమ్మడి పోరాటానికి సంబంధించిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 1నుంచి ఉమ్మడిగా జనంలోకి వెళ్ళాలని నిర్ణయించారు.

టీడీపీ-జనసేన ఉమ్మడి ఎజెండాతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నవంబర్‌ 1 నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోతో ఒకటో తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు. ఓట్ల తొలగింపుతో సహా ప్రతి ప్రజా సమస్యపై ఇక నుంచి రెండు పార్టీలు కలిసే పోరాడాలే కార్యచరణ రూపొందించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నవంబర్ 3న విజయవాడలో మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ఫ్లాన్ చేశాయి రెండు పార్టీలు. ఈ సందర్భంగా ఉమ్మడిగా ఇంటింటి ప్రచారంపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు రెండు పార్టీల నేతలు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 100 రోజుల ప్రణాళిక రూపొందించింది టీడీపీ-జనసేన. వైసీపీ పోవాలి.. టీడీపీ-జనసేన రావాలి అనే నినాదంతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్తామని ఇదివరకే పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సంయుక్తంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నవంబర్‌ 1న ఉమ్మడి కార్యాచరణతో సిద్ధమవుతున్నారు. ఇకపై ఉమ్మడి వెళ్లే ఏ కార్యక్రమంలోనూ రెండు పార్టీలు సమన్వయం కలిసి వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే విజయవాడలో మరోసారి టీడీపీ-జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

ఇటు తెలుగు దేశం పార్టీతో కలిసి నడుస్తూనే భారతీయ జనతా పార్టీతో పొత్తుపైనా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎన్డీయేలోనే కొనసాగుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నందునే పొత్తు పెట్టుకున్నామని, దీనిపై బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని పవన్ క్లారిటీ ఇచ్చారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి మూడు పార్టీలు కలిసి వెళ్ళే అవకాశమున్నట్లు పవన్ మాటలను బట్టి అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలోనే మొదటి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ మీటింగ్‌లో మూడు తీర్మానాలు చేశాయి టీడీపీ, జనసేన. ఆంధ్రప్రదేశ్‌ను అరాచక పాలన నుంచి కాపాడడం, అన్ని వర్గాలకు అభివృద్ది అందించడం, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన తెలపడం. వీటిని ఉమ్మడి కార్యాచరణగా తీసుకెళ్లడానికి జిల్లాల స్థాయిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీలోని ఉమ్మడి జిల్లాల్లో అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో జరిగే సమావేశాలకు రెండు పార్టీల కార్యకర్తలు పాల్గొని, నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఆ తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. మ్యానిఫెస్టో ప్రకటించి, నవంబర్‌ 1 నుంచే ఇంటింటి ప్రచారం కూడా చేపడతామన్నారు. ఇక ప్రజా సమస్యలపై పోరులో భాగంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రాంతాల వారీగా నివేదిక తయారు చేయబోతున్నాయి రెండు పార్టీలు. మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణపై అధికార పార్టీ నుంచి గట్టి విమర్శలే వస్తున్నాయి. ఆ రెండు పార్టీల జాయింట్‌ యాక్షన్‌తో జగన్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు వైసీపీ నేతలు.