Vijayadashami: ఆర్మీతో కలిసి ఆయుధపూజ చేసిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ..

దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయుధ పూజ ఘనంగా నిర్వహిస్తున్నారు.  అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వార్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో సరిహద్దులను కాపాడుతున్న సైనికులను రక్షణ మంత్రి కొనియాడారు. పుష్పగుచ్ఛం ఉంచిన అనంతరం సైనికులను ఉద్దేశించి రక్షణ మంత్రి మాట్లాడుతూ..  తమ విధి నిర్వహణలో సైనికులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలని ఉద్ఘాటించారు. సైనికుల అంకితభావంతో దేశానికి గర్వకారణమని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సైనికుల యూనిఫాం ప్రాముఖ్యత, సరిహద్దుల భద్రతను నిర్ధారించడంలో వారి ముఖ్యమైన పాత్రను రక్షణ మంత్రి రాజ్ నాథ్ మరోమారు ప్రస్తావించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రపంచ వేదికపై భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఆ ధైర్యాన్ని ఇచ్చిన ఘనత సైనికులకు సొంతం అని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సాధించిన ఆర్థికాభివృద్ధి, ప్రగతిని ప్రశంసించిన రక్షణ మంత్రి, సరిహద్దుల రక్షణలో సైనికుల కృషి లేకుండా ఇలాంటి విజయాలు సాధించలేవని ఉద్ఘాటించారు.

తవాంగ్‌లో ఆయుధ పూజ
తన పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ వ్యూహాత్మకంగా ముఖ్యమైన తవాంగ్ సెక్టార్‌లో మోహరించిన సైనికులతో సమావేశమయ్యారు. తవాంగ్‌లో సాంప్రదాయకమైన ఆయుధ పూజను నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతే కాకుండా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయన సైనికులతో కలిసి విజయదశమి వేడుకలు జరుపుకున్నారు. తవాంగ్ సెక్టార్‌లో చైనా పిఎల్‌ఎ ఆక్రమణలకు సంబంధించిన అనేక సంఘటనలు జరిగాయి. గత ఏడాది డిసెంబర్‌లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)ని ఉల్లంఘించింది. అప్పటి నుండి సరిహద్దుల వద్ద మరింత భద్రత పెంచడం ఆవశ్యకత గురించి పదే పదే చెబుతూనే ఉంది. తగిన ఏర్పాట్లు చేస్తూ.. ఆర్మీకి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఉంది.

Char Dham yatra : పాత రికార్డులన్నీ బద్దలు కొట్టిన చార్‌ధామ్‌ యాత్ర.. తొలిసారిగా 50 లక్షల మార్కును దాటింది!

ఈసారి చార్ ధామ్ యాత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. ఈ ఏడాది చార్ ధామ్‌ను సందర్శించిన భక్తుల సంఖ్య గతంలోని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ ఏడాది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న వారి సంఖ్య 50 లక్షల మార్కును దాటింది. చార్‌ధామ్ యాత్రను సందర్శించే భక్తుల సంఖ్య పెరగడం అన్నిరకాల అనుకూల పరిస్థితులు ఉన్నాయి. వాతావరణం, రహదారుల నిర్వహణ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమర్థ నిర్వహణను చూపుతుంది. డిసెంబర్‌లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు ముందు, ఈ గణాంకాలు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే చాలా మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.

2021లో కోవిడ్ మహమ్మారి కారణంగా యాత్రకు నష్టం వాటిల్లినందున 5.18 లక్షల మంది భక్తులు మాత్రమే సందర్శించగలిగారు. 2022లో 46.27 లక్షల మంది భక్తులు తీర్థయాత్రకు వచ్చారు. 27 డిసెంబర్ 2016న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌లో ఆల్-వెదర్ రోడ్‌కు శంకుస్థాపన చేయడం ద్వారా మెరుగైన కనెక్టివిటీకి ఒక ముఖ్యమైన అడుగు వేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రాథమిక లక్ష్యం చార్ ధామ్: యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు అన్ని వాతావరణ కనెక్టివిటీని మెరుగుపరచడం.

ఈ ప్రాజెక్ట్ యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణాను అందించింది. వాతావరణ పరిస్థితులు లేదా సహజమైన అడ్డంకులు లేకుండా వారి ప్రయాణాన్ని చేపట్టేందుకు వీలు కల్పించింది. ఈ శాశ్వత రహదారి ప్రాజెక్ట్ పూర్తి చేయడం వల్ల ఈ ప్రాంతానికి, అక్కడి నివాసితులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దీని సానుకూల ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇది పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ ప్రాంతంలో వాణిజ్యాన్ని కూడా సులభతరం చేస్తుంది. ఇది ఉత్తరాఖండ్ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేస్తుంది.

Vastu Tips: ఈ మొక్కలను ఇంట్లో పెంచితే.. అదృష్టం కలిసి వస్తుంది!

ఇంట్లోని అందరూ సంతోషంగా, శ్రేయస్సుతో ఉండాలంటే.. వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి. ఇంట్లో సరైన విధంగా వాస్తు లేకపోతే.. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, పేదరికం తాండవిస్తుంది. ఇలాంటివేమీ లేకుండా ఉండాలంటే.. కొన్ని రకాల వాస్తు టిప్స్ మనకు బాగా సహకరిస్తాయి. ఇంట్లోని వస్తువులు, మనుషులకే కాదు.. మొక్కలను పెంచడానికి కూడా వాస్తు ఉంటుందన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కొన్ని రకాల మొక్కలను ఈ దిక్కుల్లో పెడితే.. ఇంట్లో ఆరోగ్యం, అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ మొక్కలు ఏంటి? వాటిని ఏ దిక్కుల్లో పెడితే మంచిదో ఇప్పుడు చూద్దాం.

అరటి చెట్టు:

అరటి చెట్టును విశాలంగా ఉంటుంది కాబట్టి.. చాలా మంది దీన్ని ఇంట్లో పెంచరు. కానీ దీన్ని కూడా చిన్న కుండీల్లో నాటవచ్చు. ఈ అరటి చెట్టు తూర్పు దిక్కన పెట్టాలి. అరటి చెట్టును ఇంట్లో పెంచడం వల్ల శ్రేయస్సు పెరుగుతుంది. అంతే కాకుండా అరటి చెట్టు దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్ర పరుస్తుంది.

మనీ ప్లాంట్:

ఇప్పుడు ఈ మొక్క అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. ఈ మొక్క ఆరోగ్యంగా ఎదిగితే.. ఇంట్లో కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండని అందరూ భావిస్తూంటారు. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంటి ఆగ్రేయ మూలలో ఉంచాలి. ఇలా చేస్తే వాస్తు దోషాలు తొలగుతాయి.

అశోక చెట్టు:

అశోక చెట్టుకు మంచి శుభ శక్తులు ఉంటాయని నమ్మకం. అందుకే దీన్ని పవిత్రమైన మొక్కగా గుర్తిస్తారు. ఈ చెట్టు ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి. ఇది ఇంటికి సాను కూల శక్తిని తెస్తుంది.

తులసి మొక్క:

తులసి మొక్క గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మొక్క గురించి అందరికీ తెలుసు. తులసి మొక్కను కూడా పవిత్రమైన మొక్కగా భావించి పూజలు అనేవి చేస్తూంటారు. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల వాస్తు దోషాలు తొలగి.. కుటుంబం అంతా ఆనందంగా ఉంటారు. తులసిని ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులో పెట్టాలి. ఇలా పెడితే శుభ ఫలితాలు ఉంటాయి. తులసి మొక్క అస్సలు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయదు. కాబ్టటి ఇది ఆరోగ్యంగా కూడా చాలా మంచి ఫలితాలను అందిస్తుంది.

లక్కీ బ్యాంబూ మొక్క:

ఇప్పుడు చాలా మంది లక్కీ బ్యాంబూ మొక్కను కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. దీని వల్ల కూడా అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారు. ఈ మొక్క సంపద, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. అందుకే ఇది ఇండోర్ ప్లాంట్ గా బాగా ప్రాచూర్యం పొందింది. ఈ మొక్కను ఇల్లు లేదా ఆఫీసుల్లో ఉంచడం వల్ల అన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది.

Ayodhya Ram Mandir: అయోధ్య రాములవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రండి.. ప్రధాని మోదీని ఆహ్వానించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు

Ram Mandir Prana Pratishtha: శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ ముహూర్తం ఖరారు అయింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్, నృపేంద్ర మిశ్రా, మరో ఇద్దరు ప్రధాని మోదీని కలిసి.. ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ట్రస్ట్ సభ్యుల అభ్యర్థన మేరకు, ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు.

విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ ముహూర్తం ఖరారు అయింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్, నృపేంద్ర మిశ్రా, మరో ఇద్దరు ప్రధాని మోదీని కలిసి.. ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ట్రస్ట్ సభ్యుల అభ్యర్థన మేరకు,  ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు.

వెయ్యేళ్లు అయినా సరే.. చెక్కు చెదరని.. ప్రపంచంలోనే అత్యద్భుతమైన రామమందిర నిర్మాణం జరుగుతోంది. భక్తుల ఆశలకు.. ఆకాంక్షలకు అనుగుణంగా రామమందిర నిర్మాణం పూర్తి అయ్యింది. ఈక్రమంలోనే.. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని… అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది.

రాంలాలా ప్రతిష్ట ఎప్పుడంటే..
2024 జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి అయోధ్యలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ మందిర ప్రాణప్రతిష్ఠపన మహోత్సవానికి రావాలంటూ స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఇలా రాశారు- ‘జై శ్రీరామ్! ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. ఇటీవల శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆయన నన్ను ఆహ్వానించారు. ఇది రాములవారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. అంటూ ట్వీట్ ప్రధాని మోదీ చేశారు.

VK Pandian: ఒడిశా పాలిటిక్స్‌లో సూపర్ సీఎం.. ఐఏఎస్ అధికారికి బంపర్ ఆఫర్.. అసలు ఏం జరిగిందంటే..?

రాజకీయాల్లో అవకాశాలు అంత ఈజీగా రావు.. అలాగే ఒక్కోసారి అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. ప్రస్తుతం ఒడిశా రాజకీయాలలో అలాంటి పరిణామమే జరిగింది. నిన్నటిదాకా రాజ్యాంగేతర శక్తిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆ ఐఏఎస్ అధికారి ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా మారారు.. ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ సీఎంగా పిలిచే స్థాయికి చేరుకున్నారు.. తమిళనాడులో ఇపుడు ఆ ఐఎఎస్ పెరు హ్యాష్ ట్యాగ్ గా మారింది. తమిళనాడుకు చెందిన వి.కార్తికేయ పాండ్యన్ 200 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఒడిశా క్యాడర్‌కు ఎంపికైన కార్తికేయ పాండ్యన్ అనేక కీలక బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఒడిశా ప్రభుత్వం ఆయన్ను కీలక స్థానంలో కూర్చోబెట్టింది.

ట్రాన్స్ఫర్మేషనల్ ఇన్సియేటివ్స్(Transformational Initiatives) పదవి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే క్యాబినెట్ హోదా కూడా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2000 నుంచి ఐ.ఏ.ఎస్ అధికారిగా అనేక బాధ్యతలు చేపట్టిన పాండ్యన్ ఇటీవల ఒడిశా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. 2011 నుంచి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న కార్తికేయ పాండ్యన్.. అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల ముందు బిజేడి అభ్యర్థుల ఎంపికలో పాండ్యన్ కీలకంగా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత ప్రభుత్వంలో ప్రతి కీలక నిర్ణయం వెనుక కార్తీకేయ పాండ్యన్ ఆలోచన ఉండేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ప్రతిపక్షాలైతే నిత్యం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కంటే కార్తికేయ పాండ్యన్ నే ఎక్కువగా టార్గెట్ చేసేవి. ఐఏఎస్ అధికారి రాజ్యాంగేతర శక్తిగా మారారని అన్నింట్లో తల దూర్చేవారని ఆరోపణలు చేసేవి కూడా.. ఇక అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా కార్తికేయ పాండ్యన్ తీరు నచ్చేది కాదు. సీఎంను కలవాలన్నా ముందుగా కార్తికేయ పాండ్యన్ ని కలవాల్సిందే.. ఇక పాండ్యన్ ని కలవడం కూడా అంతగా కుదిరేది కాదని అసంతృప్తిగా ఉండే పరిస్థితి. ఇక త్వరలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కార్తికేయ పాండ్యన్ ఇలాంటి విమర్శల నుంచి విముక్తి కోసం తాను దూరమవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

Assembly Elections: గత ఎన్నికల్లో భారీ ఓట్లు సాధించి టాప్ 10లో నిలిచిన అభ్యర్థులు వీరే! సీఎం ఏ నంబర్‌లో ఉన్నారంటే?

నేషనల్ లెవల్ పొలిటికల్‌ మేజిక్కులకు కేరాఫ్‌ అడ్రస్‌గా వుండే మధ్యప్రదేశ్‌లో ఈసారి ఏం జరగబోతుంది. మార్చి సంక్షోభం కాంగ్రెస్‌ను గద్దెదించింది. కమల్‌నాథ్‌ పోయి కమలనాథులు పవర్‌లోకి వచ్చారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఫోర్త్‌ టర్మ్‌ సీఎం అయ్యారు. మరి ఈసారి బీజేపీ విక్టరీ కంటిన్యూ అవుతుందా? కసితో కాంగ్రెస్‌ పవర్‌ను చేజిక్కుంటుందా? ఎవరి వ్యహాలు వాళ్లవే. మధ్యప్రదేశ్‌ తీర్పు ఎటువంటి అన్నదీ ఆసక్తికరంగా మారింది.

అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్లు, మెజారిటీని పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 230 అసెంబ్లీ అభ్యర్థులలో 10 మంది భారీ ఓట్లను మెజారిటీతో గెలుపొందారు. ఈ టాప్ 10 ఎమ్మెల్యే అభ్యర్థులకు 11 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఇండోర్ 2 అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రమేష్ మెండలా మొదటి స్థానంలో ఉండగా, టాప్ 10 అభ్యర్థుల జాబితాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మూడో స్థానంలో నిలిచారు. ఈ టాప్ 10 ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీ, నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని టాప్ 10 అభ్యర్థులు భారీ విజయాన్ని సాధించారు. ఈ అభ్యర్థులపై భారీ ఓట్ల వర్షం కురిసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నుండి జితూ పట్వారీ టాప్ 10 అభ్యర్థులలో ఉన్నారు.

ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన టాప్ 10 ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఇండోర్ 2 నుంచి రమేష్ మెండోలా పేరు మొదటి స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేష్ మెండోలాకు 1 లక్షా 38 వేల 794 ఓట్లు అంటే 63.95 శాతం ఓట్లు వచ్చాయి. అదేవిధంగా, భోపాల్‌లోని గోవింద్‌పురా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కృష్ణ గౌర్‌కి 1 లక్షా 25 వేల 487 అంటే 58 శాతం ఓట్లు దక్కాయి. బుద్నీ నుంచి బీజేపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు 1 లక్షా 23 వేల 492 ఓట్లు పోలయ్యాయి. మొత్తం నిజయోజకవర్గంలోని ఓట్లలో 60.25 శాతం చౌహాన్‌కు దక్కాయి. ఇండోర్ 5 స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మహేంద్ర హార్దియా 1 లక్షా 17 వేల 836 ఓట్లు రాగా 48.30 శాతం ఓట్లు అతని ఖాతాలో చేరాయి. ఇండోర్ 1 నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శుక్లాకు 1 లక్షా 14 వేల 555 (50.24 శాతం) ఓట్లు వచ్చాయి.

భోపాల్‌లోని నరేలా స్థానం నుంచి బీజేపీకి చెందిన విశ్వాస్ సారంగ్ కోక్‌కు 1 లక్షా 8 వేల 654 (53.24 శాతం), కుక్షి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర బఘెల్‌కు 1 లక్షా 8 వేల 391 (65.63 శాతం), రౌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జితు పట్వారీకి 1 లక్షా 7వేల 740 ఓట్లు వచ్చాయి. మొత్తం నియోజకవర్గ ఓట్లలో 49.95 శాతం దక్కించుకున్నారు. హుజూర్‌ నుంచి రామేశ్వర్ శర్మకు 1 లక్షా 7 వేల 288 (51.35 శాతం) ఓట్లు, భైందేహి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ధర్ము సింగ్ సిర్సామ్‌కు 1 లక్షా 4 వేల 592 (52.10 శాతం) ఓట్లు వచ్చాయి.

Viral video: పాముకు సీపీఆర్ చేసిన పోలీస్‌. వైరల్‌ వీడియో..

మనిషి అనుకోకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు సీపీఆర్‌ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో గుండె పోటుతో ఉన్నట్లుండి పడిపోతున్న వారికి ఇలా సీపీఆర్‌ నిర్వహించి తిరిగి స్పృహలోకి తీసుకొచ్చిన సంఘటనలు చూసే ఉంటాం. కృత్రిమంగా శ్వాసను అందించి మనిషి గుండెను తిరిగి యాక్టివేట్‌ చేయడమే ఈ సీపీఆర్‌ విధానం ముఖ్య ఉద్దేశం.

మనిషి శ్వాస తీసుకోలేని సమయంలో నోటి ద్వారా శ్వాసను అందించడం ద్వారా మనిషిని బతికిస్తారు. అయితే ఇలాంటి సీపీఆర్‌ను పాముకు చేస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా మనిషి నోట్లో ఊదినట్లు పాము నోట్లో గాలి ఊదితే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ.! కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్‌ ఆఫీసర్‌ మాత్రం పాముకు సీపీఆర్‌ చేసిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో క్రిమి సంహారక మందు కలిపిన నీటిని తాగిన ఓ పాము స్పృహప్పిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ ఇది గమనించి వెంటనే పామును బతికించాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా వెంటనే ఆ పామును చేతిలోకి తీసుకొని శ్వాస ఆడుతుందో లేదో చెక్‌ చేశాడు. పాము శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని గమనించిన కానిస్టేబుల్‌ పాము నోట్లో నోరు పెట్టి శ్వాసను అందించడం ప్రారంభించాడు.

ఇలా రెండు సార్లు చేసేసరికి పాము స్పృహలోకి వచ్చింది. దీంతో పామును వదిలేశాడు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో కాస్త తెగ వైరల్‌ అవుతోంది. అనురాగ్ ద్వారీ అనే వ్యక్తి తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు కానిస్టేబుల్‌ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. పామును కాపాడిన ఆ కానిస్టేబుల్‌ పరు అతుల్‌ శర్మగా గుర్తించారు. ఏది ఏమైనా పోలీస్‌ ఆఫీసర్‌ చూపించిన ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే కదూ.!

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో దారుణం.. వృద్ధుడిపై దాడి చేసిన యువకుడి వీరంగం.. వీడియో వైరల్‌..

Delhi Metro: గత కొద్ది రోజులుగా ఢిల్లీ మెట్రోకు సంబంధించి అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని సరదా సంఘటనలు, కొన్ని షాకింగ్‌ విషయాలు కూడా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకుల చేష్టలు, అసభ్యకర ప్రవర్తనలు, డ్యాన్స్‌ రీల్స్‌ వంటి వింత పోకడలకు సంబంధించిన వీడియోలు త‌ర‌చూ వైర‌ల్‌ అవుతుంటాయి. మెట్రోలో కొందరు చేసే చిలిపి పనులు, అల్లరి చేష్టలు, యువతి యువకుల రోమాన్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా అనేకం చూశాం. మెట్రో ప్రయాణికుల మధ్య చిన్నచిన్న కార‌ణాల‌కే గొడ‌వ‌లు పడుతుండటం, వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు చాలా చూశాం. ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక వృద్ధుడి పై తోటి ప్రయాణికుడు దుసురుగా ప్రవర్తించాడు.

వైరల్‌ అవుతున్న వీడియోలో మెట్రో రైలు కోచ్‌లో నిలబడి ఉన్న ఒక వృద్ధ ప్రయాణికుడిపై తోటి వ్యక్తి వాగ్వాదానికి దిగటం కనిపించింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి సదరు పెద్దమనిషిపై ఒక్కసారిగా దాడికి దిగాడు…అది గమనించిన తోటి ప్రయాణికులు జోక్యం చేసుకొని పెద్దాయనకు సాయంగా నిలిబడ్డారు.. దాడి చేసిన వ్యక్తిని వారిస్తూ.. దూరంగా నెడుతున్నారు. అంతా కలిసి అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అయితే, అక్కడ జరిగిన గొడవకు కారణంగా మాత్రం తెలియారాలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వెల్‌కమ్ టు ఢిల్లీ మెట్రో’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దిశా షెరావత్ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోని షేర్ చేసింది. దిశా సెహ్రావత్ అనే ఖాతా ద్వారా ఈ వీడియోని షేర్‌ చేశారు. అయితే, వృద్ధుడిపై యువకుడు ఎందుకు దాడి చేశాడో స్పష్టంగా తెలియరాలేదు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో చాలా మంది స్పందించారు. యువకుడిని వ్యతిరేకిస్తూ పెద్దాయనపై దాడిని ఖండించారు. దిశా షెరావత్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 50 లక్షల మందికి పైగా వీక్షించారు. కొద్దిరోజుల క్రితం మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. బ్యాక్‌ప్యాక్‌లు ధరించిన ఇద్దరు యువకులు రైలులోపల తలపడ్డారు. మీ ఫైటింగ్‌ ఆపాలంటూ..తోటి ప్రయాణికులు ఎంతగా కోరినప్పటికీ వారు తమ గొడవను ఆపలేదు. ఇతర ప్రయాణికులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

BS Yeddyurappa: మాజీ ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్.. జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బిఎస్ యడ్యూరప్పకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటీవల బెదిరింపు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కర్నాటకలో పనిచేస్తున్న ఛాందసవాద గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా, IB ఇటీవల యడ్యూరప్ప భద్రతపై కేంద్రానికి నివేదిక సమర్పించింది. IB నివేదికలో అతని భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. ఆ తర్వాత వారి భద్రతను పెంచడానికి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం

సీఆర్‌పీఎఫ్ కమాండోలకు భద్రత బాధ్యతలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కమాండోలకు చెందిన సాయుధ సిబ్బంది యడియూరప్ప భద్రతను చూసుకుంటారు. యడియూరప్ప భద్రత కోసం మొత్తం 33 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని మోహరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదనంగా, అతని నివాసం వద్ద 10 మంది సాయుధ స్టాటిక్ గార్డులు, ఆరుగురు వ్యక్తిగత భద్రతా అధికారులతో రౌండ్-ది-క్లాక్ భద్రతను నియమించారు.

డ్రైవర్ల బృందాన్ని కూడా భద్రతా వలయం శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన డ్రైవర్లను కూడా వారి కాన్వాయ్‌లో చేర్చారు. ప్రమాదంలో ఉన్న సమయంలో యడూరప్ప సురక్షితంగా తరలించగలరు. 12 మంది సాయుధ ఎస్కార్ట్ కమాండోలను మూడు షిఫ్టుల్లో మోహరించింది. ఉగ్రవాదుల బెదిరింపులకు వ్యతిరేకంగా నిరంతరం నిఘా ఉంచుతారు. నిరంతరం నిఘా ఉంచేందుకు, షిఫ్టుల వారీగా ఇద్దరు పరిశీలకులను నియమిస్తారు. వీరిలో యడియూరప్ప ఎల్లప్పుడూ రెండు అంచెల భద్రతను కలిగి ఉంటారు.

యడ్యూరప్పకు బెదిరింపులు యడ్యూరప్ప భద్రత కోసం మోహరించిన కమాండోలు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం కలవారు. ఆయుధాలు లేకపోయినా పోరాడడంలో నిష్ణాతులని హోం శాఖ వర్గాలు చెప్పినట్లు సమాచారం. వారికి మెషిన్ గన్‌లు, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలను రౌండ్ ది క్లాక్ అమర్చారు. యడ్యూరప్ప కుటుంబానికి చెందిన చాలా మంది రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. గత కొంతకాలంగా తీవ్రవాద గ్రూపుల నుండి యడేూరప్పకు బెదిరింపులు వస్తున్నాయి. ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖ ఈ ముఖ్యమైన చర్య తీసుకుంది.

ATM Withdrawal: ఏటీఎమ్‌లో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలో తెలుసా.?

ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ పెరిగిన ఈ రోజుల్లోనూ ఇప్పటికీ ఏటీఎమ్‌లో డబ్బులు విత్‌డ్రా చేస్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ఏటీఎమ్‌లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం సులభతరమైంది. అయితే ఏటీఎమ్‌లో డబ్బు తీసుకునే సమయంలో చిరిగిన నోట్లు రావడం కూడా సర్వసాధారణమైన విషయం తెలిసిందే.

మనలో చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. చిరిగిన నోట్లను మార్చుకోవడం అంత సులభమైన విషయమేమి కాదు. ఎవరికీ ఇచ్చినా తీసుకోవడానికి నిరాకరిస్తుంటారు. మరి ఏటీఎమ్‌ నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి.? బ్యాంక్‌ నియమాలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.. ఏటీఎమ్‌ల నుంచి చిరిగిన నోట్లు వస్తే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకునే వెసులుబాటు ఉందని మీకు తెలుసా.? అవును.. మ్యుటిలేడెట్ నోట్లను సులభంగా భర్తీ చేసుకోవచ్చు. ఏటీఎమ్‌లో వచ్చిన చిరిగిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు నిరాకరించకూడదని ఆర్‌బీఐ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. కేవలం నిమిషాల్లోనే నోట్లను మార్చుకోవచ్చు.

ఇందుకోసం మీకు చిరిగిన నోటు వచ్చిన ఏటీఎమ్‌ లింక్‌ చేసిన బ్యాంకులో సంప్రదించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకుకు వెళ్లి అప్లికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం, ఏటీఎమ్‌ పేరును పేర్కొనాలి. దీంతో పాటు ఏటీఎమ్‌ ట్రాన్సాక్షన్‌ తర్వాత వచ్చే స్లిప్‌ను అప్లికేషన్‌కు జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్లిప్‌ ఇవ్వకపోతే మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించినా సరిపోతుంది. ఈ వివరాలను అన్నింటినీ అందిస్తే వెంటనే బ్యాంకులో నోట్లను మార్చుకోవచ్చు. చిరిగిన నోట్లను మార్చడాన్ని బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో నిరాకరించకూడదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2017 ఏప్రిల్‌లో తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఏటీఎమ్‌లలో చిరిగిన నోట్లు రాకుండా ఉండడానికి దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ అత్యాధునిక నోట్ సార్టింగ్ మిషన్‌ను ఉపయోగిస్తుంది. దీంతో చిరిగిన నోట్లు ఏటీఎమ్‌లో రాకుండా చేస్తుంది. అయితే ఒకవేళ పొరపాటున ఏదైనా చిరిగిన నోటు వచ్చినా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇదిలా ఉంటే ఒకవేళ ఏదైనా బ్యాంకు చిరిగిన నోటును మార్చడానికి నిరాకరిస్తే రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం చిరిగిన నోట్లను మార్చే బాధ్యత బ్యాంకుపై పాత్రమే ఉంటుంది. డబ్బును ఏటీఎమ్‌లో ఇన్‌స్టాల్‌ చేసే ఏజేన్సీలకు ఎలాంటి సంబంధం ఉండదు.
ఇక చిరిగిన నోట్లను బ్యాంకులు మాత్రమే కాకుండా రిజర్వ్‌ బ్యాంక్ కార్యాలయాల్లో కూడా మార్చుకోవచ్చు. ఆర్‌బీఐ నిబంధలన ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు, ఈ నోట్ల గరిష్ట విలువ రూ. 5000 మించకూడదు. అయితే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. నోట్లు బాగా కాలిపోయినా, ముక్కలుగా మారినా వాటిని మార్చుకోవడానికి కుదరదు.