Khammam Student: అమెరికాలో కత్తిపోట్లకు గురైన తెలుగు విద్యార్థి మృతి.. MS చదివేందుకు వెళ్లి..

Khammam student dies in US: అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో తెలంగాణలోని ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్‌ (29) MS చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. అక్టోబర్ 30న జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో అతడిపై దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వరుణ్​ను ఆస్పత్రికి తరలించారు.. అనంతరం కేసు నమోదు చేసుకుని దుండగుడిని అరెస్టు చేశారు.
గతనెల 30 నుంచి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్‌రాజ్‌ తొమ్మిది రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడి మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు అమెరికా అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వరుణ్‌రాజ్‌ మృతితో అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వరుణ్‌ మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ దాడి జరిగిన మూడు రోజుల తర్వాత ఈ ఘటనపై స్పందించిన అమెరికా.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. అంతేకాదు, ఈ ఘటన అత్యంత బాధాకరమంటూ విచారం వ్యక్తం చేసింది.

Girl Killed : ప్రేమ పెళ్లి చేసుకుంటానన్న యువతిని హత్య చేసిన తల్లి, అన్న

Anantapur Girl Killed : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుంటానన్న యువతిని తల్లి, అన్న కలిసి హత్య చేశారు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానంటున్న యువతిని ఆమె తల్లి, అన్న కలిసి చంపేశారు.

గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో కోమల(17) అనే బాలిక పెద్దలు చూసిన సంబంధం కాకుండా నచ్చిన వాడిని చేసుకుంటానంటూ కుటుంబ సభ్యులతో గొడవ పడింది. కుమార్తె పెళ్లి చేసే విషయంలో కుటుంబ సభ్యల మధ్య గొడవ జరిగింది. బాలిక పెళ్లి సంబంధం వివాదం హత్యకు దారి తీసింది.

కోమలను తల్లి, సోదరుడు చితకబాది, ఆపై ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. కూతురును చంపిన అనంతరం పోలీస్ స్టేషన్ లో తల్లి, సోదరుడు లొంగిపోయారుు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Vijayawada Bus Accident: గేర్‌ తప్పుగా మార్చడంతోనే ప్రమాదం.. విజయవాడ ఘటనలో ముగ్గురిపై చర్యలు

Vijayawada Bus Accident: విజయవాడ బస్టాండ్‌లోకి బస్సు దూసుకెళ్లి.. ముగ్గురు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్‌ ప్రకాశం సహా మరో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తూ ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. బస్సు డ్రైవర్‌ ప్రకాశం తప్పుగా గేర్‌ ఎంచుకోవడం వల్లే బస్సు బస్టాండ్‌లోకి దూసుకెళ్లిందని నివేదికలో పేర్కొన్నారు. దాంతో డ్రైవర్‌ ప్రకాశంపై సస్పెన్షన్‌ వేటు వేశారు. విధుల పర్యవేక్షణలో ఆటోనగర్‌ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ వి.వి.లక్ష్మి విఫలమయ్యారని నిర్ధరించారు. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టం ఉన్న బస్సుకు పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న డ్రైవర్లను పంపాల్సి ఉంది. కానీ.. అలా చేయకుండా సూపర్‌ లగ్జరీ బస్సులను నడిపిన డ్రైవర్‌ ప్రకాశాన్ని పంపారని కమిటీ తేల్చింది. కానీ.. డ్రైవర్‌కు ముందస్తుగా.. సమగ్ర శిక్షణ ఇవ్వలేదని నిర్ధారించారు. అందుకు.. ఆటోనగర్ అసిస్టెంట్ డిపో మేనేజర్ వి.వి లక్ష్మి బాధ్యతారాహిత్యమే కారణమని తెలుపుతూ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారాలను సమగ్రంగా పర్యవేక్షించాల్సిన ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ విఫలమయ్యారని కమిటీ తేల్చింది. ఆయనపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రెండు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్ లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కండక్టర్ వీరయ్య, కుమారి, చిన్నారి అయాన్స్ గా గుర్తించారు. మృతుల కటుంబ సభ్యులకు ఆర్టీసీ 5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 10 లక్షలు ప్రకటించారు.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. బస్సు ప్రమాదంతో ఆర్టీసీ డిపార్ట్‌మెంట్‌ కూడా ఉలిక్కిపడింది. వెంటనే ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేసిన ఆర్టీసీ కమిటీ.. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో.. దాని ఆధారంగా ఆర్టీసీ అధికారులు ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు.

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో దారుణం.. వృద్ధుడిపై దాడి చేసిన యువకుడి వీరంగం.. వీడియో వైరల్‌..

Delhi Metro: గత కొద్ది రోజులుగా ఢిల్లీ మెట్రోకు సంబంధించి అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని సరదా సంఘటనలు, కొన్ని షాకింగ్‌ విషయాలు కూడా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకుల చేష్టలు, అసభ్యకర ప్రవర్తనలు, డ్యాన్స్‌ రీల్స్‌ వంటి వింత పోకడలకు సంబంధించిన వీడియోలు త‌ర‌చూ వైర‌ల్‌ అవుతుంటాయి. మెట్రోలో కొందరు చేసే చిలిపి పనులు, అల్లరి చేష్టలు, యువతి యువకుల రోమాన్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా అనేకం చూశాం. మెట్రో ప్రయాణికుల మధ్య చిన్నచిన్న కార‌ణాల‌కే గొడ‌వ‌లు పడుతుండటం, వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు చాలా చూశాం. ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక వృద్ధుడి పై తోటి ప్రయాణికుడు దుసురుగా ప్రవర్తించాడు.

వైరల్‌ అవుతున్న వీడియోలో మెట్రో రైలు కోచ్‌లో నిలబడి ఉన్న ఒక వృద్ధ ప్రయాణికుడిపై తోటి వ్యక్తి వాగ్వాదానికి దిగటం కనిపించింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి సదరు పెద్దమనిషిపై ఒక్కసారిగా దాడికి దిగాడు…అది గమనించిన తోటి ప్రయాణికులు జోక్యం చేసుకొని పెద్దాయనకు సాయంగా నిలిబడ్డారు.. దాడి చేసిన వ్యక్తిని వారిస్తూ.. దూరంగా నెడుతున్నారు. అంతా కలిసి అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అయితే, అక్కడ జరిగిన గొడవకు కారణంగా మాత్రం తెలియారాలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వెల్‌కమ్ టు ఢిల్లీ మెట్రో’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దిశా షెరావత్ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోని షేర్ చేసింది. దిశా సెహ్రావత్ అనే ఖాతా ద్వారా ఈ వీడియోని షేర్‌ చేశారు. అయితే, వృద్ధుడిపై యువకుడు ఎందుకు దాడి చేశాడో స్పష్టంగా తెలియరాలేదు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో చాలా మంది స్పందించారు. యువకుడిని వ్యతిరేకిస్తూ పెద్దాయనపై దాడిని ఖండించారు. దిశా షెరావత్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 50 లక్షల మందికి పైగా వీక్షించారు. కొద్దిరోజుల క్రితం మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. బ్యాక్‌ప్యాక్‌లు ధరించిన ఇద్దరు యువకులు రైలులోపల తలపడ్డారు. మీ ఫైటింగ్‌ ఆపాలంటూ..తోటి ప్రయాణికులు ఎంతగా కోరినప్పటికీ వారు తమ గొడవను ఆపలేదు. ఇతర ప్రయాణికులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

Hyderabad: తగ్గేదేలే.. అంటూ పుష్ప సినిమాను మించిన సీన్.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

తగ్గేదేలే.. పుష్ప సినిమా ట్రెండ్ గురించి మనం చెప్పాల్సిన పనేలేదు.. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టర్.. ముఖ్యంగా గంధపు చెక్క అక్రమ రావాణా కథాంశంగా తీసిన ఈ సినిమా.. పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది.. త్వరలోనే పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ కానుంది. అయితే, పుష్ప సినిమా తర్వాత.. అక్రమ రవాణా ఎలా జరుగుతుంది..? ఇలాంటి స్టైల్లో కూడా రవాణా చేస్తారా..? అనే కొత్త విషయాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే.. అదే తరహాలో డబ్బు, గంజాయ్, బంగారం, డ్రగ్స్.. ఇలా ఎన్నో విలువైన వస్తువులు అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. అయితే.. తాజాగా.. పుష్ప సినిమా స్టైల్లో అక్రమంగా గంజాయ్ తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్‌ పేట్ బషీరాబాద్ ‌పీఎస్ పరిధి దూలపల్లి క్రాస్ రోడ్డు దగ్గర నిర్వహించిన వాహన తనిఖీలతో గంజాయి ముఠా ఆపరేషన్‌ బయటపడింది. కారు నెంబర్‌ AP 36 R 3033కి పుష్ప సినిమా తరహాలో ప్రత్యేకంగా సీటు అమర్చి గంజాయి సప్లై చేస్తున్న ముఠా పట్టుబడింది. కారు వెనుక‌ భాగంలో డిఫరెంట్ సెటప్ ఏర్పాటు చేశారు నిందితులు. కారు ఆపి తనిఖీ చేయగా 41 ప్యాకెట్‌లు, 82 రెండు కిలోల గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యుల బాగోతం బయటపడింది.

సుచిత్ర సెంటర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారును దూలపల్లిలో నిలిపి తనిఖీలు చేశారు పోలీసులు. నిందితుల నుంచి ‌కారు, రెండు సెల్ ఫోన్లు, ‌41 ప్యాకెట్‌లలో అమర్చిన 82 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అమర్నాథ్, సంజీవ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితులను లోతైన సమాచారం రాబడుతున్నారు పేట్ బషీర్‌బాద్ పోలీసులు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? వీరి ఆపరేషన్ ఎలా సాగుతుందనే కోణంలో కూపీ లాగుతున్నారు.

Telangana: దారుణం..కోతుల‌కు విషం పెట్టి చంపిన మ‌నుషులు.. నిందితులను పట్టుకోవాలంటూ స్థానికుల డిమాండ్..

Peddapalli District: గ్రానైట్ వ్యాపారం కారణంగా కొండలు అంతరించి పోతున్నాయి. దీంతో వానరాలు తిండి కోసం గ్రామలకు వలస వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని కొందరు వ్యక్తులకు కోతులకు విషమిచ్చి చంపేశారు. చనిపోయిన కోతులను చూసి స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక సర్పంచ్ శ్రావణ్ కు సమాచారం అందించారు. సర్పంచ్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో ఫారెస్ట్ అధికారులు
పాపం.. మూగ జీవలను చంపేశారు… దేవుడికి ప్రతి రూపంగా భావించే వానరాలకు విషం పెట్టి దారుణంగా హత్య చేశారు.. 35కు పైగా కోతులు మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. ఈ సంఘటన పై విచారణ చేపట్టారు. ఈ దారుణ సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బ పల్లి గ్రామ సమీపంలోని స్మశాన వాటిక దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు కోతులకు విషం పెట్టి చంపేశారు. మృతి చెందిన కోతులను తీసుకొచ్చి స్మశాన వాటిక సమీపంలో పడ వేశారు. 35 పైగా కోతులు చనిపోయి ఉన్నాయి..

అయితే, పథకం ప్రకారమే.. ఈ కోతులను చంపేశారని తెలిసింది.. ఇటీవల కోతులు గ్రామాల్లోకి విపరీతంగా వస్తున్నాయి.. గ్రానైట్ వ్యాపారం కారణంగా కొండలు అంతరించి పోతున్నాయి. దీంతో వానరాలు తిండి కోసం గ్రామలకు వలస వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని కొందరు వ్యక్తులకు కోతులకు విషమిచ్చి చంపేశారు.  చనిపోయిన కోతులను చూసి స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక సర్పంచ్ శ్రావణ్ కు సమాచారం అందించారు.  సర్పంచ్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో ఫారెస్ట్ అధికారులు వచ్చి వాటిని పశు వైద్యాధికారి రఘుపతి రెడ్డి ఆయన టీం తో పంచనామా చేయించారు.  విషం పెట్టి చంపిన వ్యక్తులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఏది ఏమైనా మూగజీవాలను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలి తప్ప , విషం పెట్టి చంపడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులే ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు.. ఈ కోతుల అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు..

Telangana: మహబూబాబాద్‌‌లో దారుణం.. శీలానికి వెలకట్టి మరి యువతి ప్రాణాలను బలిగొన్నారు..

Follow Us :

Mahabubabad News: తెలంగాణలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు హడలెత్తిస్తున్నాయి. ప్రేమ పేరుతో ఓ యువతి గొంతుకోశాడు మహబూబాబాద్‌కి చెందిన వినయ్‌. బీటెక్‌ విద్యార్థిని పెళ్ళిచేసుకుంటానని నమ్మించి నయవంచన చేశాడు. గత కొంతకాలంగా యువతిని లైంగికంగా ఉపయోగించుకున్నాడు. పెళ్ళి ప్రస్తావన రాగానే మొహం చాటేశాడు. అంతేకాదు. ఐదు లక్షలకు భవ్య శీలానికి వెలకట్టాడు వినయ్‌. పెద్దమనుషుల ద్వారా పంచాయితీ పెట్టి మరి బేరం పెట్టాడు.. దీంతో తనకు జరిగిన మోసాన్ని భరించలేక, అవమానాన్ని తట్టుకోలేక భవ్య ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు వినయ్‌ని ప్రాధేయపడుతోన్న ఫోన్‌ సంభాషణ ప్రస్తుతం కలకలం రేపుతోంది.

ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే, భవ్య ప్రాణాలు తీసిన వినయ్‌ పై చర్యలు తీసుకోవాలని.. భవ్య కుటుంబసభ్యులు మృతదేహంతో వినయ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. భవ్య ప్రాణాలు తీసిన వినయ్‌ని శిక్షించాలని డిమాండ్ చేసింది. దీంతో కురవి మండలం నేరడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భవ్య ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చేస్తోంది. కాగా.. యువతి శీలానికి వెలకట్టి మరి పెద్దలు బలిగొన్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

WEB POSTS :