Telangana Election 2023: Minister KTR Counter To PM Modi Says We Are Not B Team Of BJP, C Team Of Congress

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అంతేకాకుండా.. మాటల తూటాలు పేల్చుతూ.. ఎన్నికల రణరంగంలో సవాల్ చేసుకుంటున్నాయి. తాజాగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయాలను మరింత హీటెక్కించింది. బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి నుంచే తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారన్నారు. మోదీని ప్రధానిని చేసే ఘట్టానికి పునాది పడింది ఇక్కడే అన్న ఆయన.. ఈ నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తెలంగాణలో మార్పు తుఫాన్‌ కనిపిస్తోంది.. ఇక్కడ గెలిచేది బీజేపీనే అన్నారు.. కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ బీఆర్‌ఎస్‌ పార్టీ అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ డీఎన్‌ఏలో 3 అంశాలు ఉన్నాయన్నారు. లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్‌ మాపై ఆరోపణలు చేస్తోందని.. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదని, కచ్చితంగా జైలులో వేస్తామంటూ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ జన్మలో బీసీని సీఎంని చేయనివ్వరు.. మాది ఎన్డీయే, బీజేపీ.. ఓబీసీ మిత్రులపై అత్యంత ప్రేమ ఉంటుందంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

కాగా.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. రాహుల్‌ వచ్చి.. బీఆర్‌ఎస్‌ని బీజేపీ బీ టీమ్‌ అంటారని.. ఇప్పుడు మోదీ.. కాంగ్రెస్‌కి సీ టీమ్ అంటున్నారని.. తమది మాత్రం ముమ్మాటికీ టీ టీమ్‌, అంటే తెలంగాణ టీమ్‌ అన్నారు కేటీఆర్‌. బీఆర్‌ఎస్‌ అంటేనే భారత రైతు సమితి అన్నారు. ఇక ఒక్కసారి కూడా రుణమాఫీ చేయని వాళ్లు.. మాపై విమర్శలు చేయడం విడ్డూమన్నారు. నిన్నటి వరకు మత రాజకీయాలు చేశారు.. ఇప్పుడు కుల రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. బీజేపీ హయాంలో బీసీలకు మిగిలింది అరణ్య రోదనేనన్నారు. ఇక TSPSC పేపర్లు లీక్‌ చేసింది మీ బీజేపీ నేతలే అని.. నిందితులతో వేదిక పంచుకుని మాపై నిందలా అంటూ మండిపడ్డారు.

Telangana Election: తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం.. సహాయకుడిగా వచ్చే వారికి ఇంక్ తప్పనిసరి..!

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను ఈసీ సమీక్షించింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ విషయంలో కొన్ని సూచనలు, నిబంధనలు జారీ చేసింది ఎన్నికల కమిషన్.

తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక మార్పులు చేసింది. ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెడతారు. సహాయకుడు అదే బూత్‌కు చెందిన ఓటరై ఉండాలి. తన ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలి. ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కీలక మార్పులు చేసింది.

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అందరూ ఎన్నికల కోడ్ పాటించాలని సూచించింది ఎన్నికల కమిషన్. నిబంధనలు పాటించకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రచారంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించే స్థలం, సమయం తదితర వివరాలను స్థానిక పోలీస్ అధికారులకు తెలియజేయాలని తెలిపారు. కుల, మత, భాషలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదన్నారు.

నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అఫిడవిట్ లోని అన్ని కాలమ్స్‌ను తప్పనిసరిగా అభ్యర్థులకు సూచించారు. నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ ద్వారా కూడా స్వీకరించడం జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. పోటీలో ఉండే అభ్యర్థులు తమ క్రిమినల్ రికార్డులను  లీడింగ్ న్యూస్ పేపర్స్, టీ.వీ ఛానళ్లలో పబ్లిష్ చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చును అధ్యయనం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం రాష్ట్రంలో ఇప్పటికే పర్యటిస్తోంది. అటు ఈసారి ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రారంభిస్తారు. పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూడా కూర్చునేందుకు అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. మరోవైపు పోలింగ్ శాతం పెంచే అంశంపైనా ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు సదస్సులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది.

Khammam Student: అమెరికాలో కత్తిపోట్లకు గురైన తెలుగు విద్యార్థి మృతి.. MS చదివేందుకు వెళ్లి..

Khammam student dies in US: అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో తెలంగాణలోని ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్‌ (29) MS చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. అక్టోబర్ 30న జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో అతడిపై దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వరుణ్​ను ఆస్పత్రికి తరలించారు.. అనంతరం కేసు నమోదు చేసుకుని దుండగుడిని అరెస్టు చేశారు.
గతనెల 30 నుంచి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్‌రాజ్‌ తొమ్మిది రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడి మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు అమెరికా అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వరుణ్‌రాజ్‌ మృతితో అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వరుణ్‌ మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ దాడి జరిగిన మూడు రోజుల తర్వాత ఈ ఘటనపై స్పందించిన అమెరికా.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. అంతేకాదు, ఈ ఘటన అత్యంత బాధాకరమంటూ విచారం వ్యక్తం చేసింది.

Telangana Election: తెలంగాణ అమాత్యుల్లో టెన్షన్ టెన్షన్.. మంత్రులు సేఫ్ జోన్‌లో ఉన్నారా..?

ఎన్నికల సమయం ఆసన్నమైదంటే చాలు.. రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకోవడానికి తమ శక్తియుక్తులను కూడగట్టుకుని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తారు. ప్రజల మధ్యకు చేరుకుని వారిని ఆకట్టుకుని, ఆకర్షించడానికి చేసే యత్నాల గురించి ఎంత చెప్పినా తక్కువే..! ఇప్పుడు ఇదే విధంగా తెలంగాణలో ప్రచారం హోరెత్తుతుంది. పల్లెలు, పట్టణాల్లో రాజకీయ కోలాహలం నెలకొంది.

నామినేషన్లపర్వం ప్రారంభం కావటంతో అటు విపక్షాలు సైతం ప్రచారంలో జోరు పెంచాయి. ప్రచార రథాల రాక, మైకుల మోత, నేతల పర్యటనలు, కార్యకర్తల హడావిడితో పల్లెలు పట్టణాల్లో రాజకీయ కోలాహాలం నెలకొంది. ఎన్నికల గడువు నెల రోజులు కూడా లేకపోవటంతో, తెల్లవారింది మొదలు.. సాయంత్రం పొద్దుబోయేదాకా అభ్యర్థులు ఊరూవాడా చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న మంత్రులు అంతా సేఫ్ జోన్లో ఉన్నారా? ఎంత మంది మంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు? సేఫ్ జోన్‌లో ఉన్న మంత్రులు ఎవరు? రిస్క్ జోన్‌లోకి వెళుతున్నదీ ఎవరు అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కి‌ల్స్‌లో మొదలైంది.

పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల గెలుపోటములపై చర్చ మొదలైంది. ఇటు బెట్టింగ్‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. అధికార పార్టీకి చెందిన మంత్రుల్లో బరిలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో అన్న హాట్ హాట్ చర్చ మొదలైంది. కేసీఅర్ కేబినెట్‌లో ఉన్న మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్‌లు పోటీలో లేరు. మిగిలిన వారంతా బరిలో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావులను పక్కన పెడితే, మిగిలిన వారిపై చర్చ మొదలైంది. అటు కాంగ్రెస్ ,ఇటు బిజెపి పార్టీలు బరిలో ఉన్న మంత్రులపై బలమైన అభ్యర్థులను దింపే ప్రయత్నం చేసింది. అదే సమయంలో ప్రధాన పార్టీలు మంత్రుల నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాయి. ఆయా పార్టీల అగ్ర నేతలు మంత్రుల నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి వెళుతున్నారు.

మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డీ బరిలో ఉండడంతో నిర్మల్ నియోజకవర్గంపై అందరి నజర్ ఉంది. ఇటు ప్రశాంత్ రెడ్డిపై సునీల్ రిడ్డీ పోటీలో ఉండడంతో ఇప్పుడు బాల్కొండ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. ఇటు కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సై అనడంతో ఆ నియోజకవర్గం సెన్సేషనల్‌గా మారింది. ఇక ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ గెలుపోటములపై హాట్ హాట్ గా చర్చలు మొదలు అయ్యాయి. ఇటు పువ్వాడ అజయ్‌పై కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తుండడంతో ఆ సీటు ఫలితంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగి రెడ్డీ నిరంజన్ రెడ్డి పోటీలో ఉన్న నియోజకవర్గాల ఫలితాలపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్న సనత్ నగర్, మల్లా రెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గాల రిజల్స్ట్‌పై ఉత్కంఠ భరింతంగా మారింది.

మొత్తంగా పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ మంత్రులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు మారేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇక వీరి రాజకీయ భవిష్యత్ తేలాలంటే డిసెంబర్ మూడో తేదీ వరకు ఆగాల్సిందే..!

Telangana Election: హాట్ సీటుగా పాలేరు.. కాంగ్రెస్, సీపీఎం పొత్తు కటీఫ్.. ఎవరి ఓట్లకు గండి..!

తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ సీటుగా మారిన పాలేరు నియోజక వర్గంలో.. రోజుకో విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అందరూ ఊహించినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ షర్మిల పాలేరు పోటీ నంచి తప్పుకున్నారు. అనూహ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయితే షర్మిల తప్పుకున్నా.. ఇపుడు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీకి సై అంటున్నారు. దీంతో గెలుపు ఓటములను ప్రభావితం చేసే లెఫ్ట్ ఓటు బ్యాంకుతో.. ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంచనాలకు అందని, ఊహించని రాజకీయ పరిణామాలతో ఆసక్తి కరంగా మారింది. చివరి వరకు టికెట్‌పై ఆశ పెట్టుకున్న తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రె కి బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడంతో.. తుమ్మల కాంగ్రెస్ గూటికి చేరారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి, గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్ళు కడుగుతానని, దాని కోసమే పాలేర లో పోటీ చేస్తున్నట్లు తుమ్మల ప్రకటించారు. కానీ అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణాలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెరపైకి వచ్చారు. దీంతో తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు.

వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాలేరులో పోటీ చేస్తానని మాట ఇచ్చారు. నియోజకవర్గంలో నూతన క్యాంపు కార్యాలయం, సొంతంగా ఇళ్ళు కూడా నిర్మిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేశారు. అయితే ఉహించని విధంగా ఒక దశలో కాంగ్రెస్‌లో పార్టీ విలీనం పై చర్చలు జరిపారు. కానీ దానికి బ్రేక్ పడటంతో ఒంటరిగా పాలేరు లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు షర్మిల. కానీ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో పాలేరు రాజకీయం మరో మలుపు తిరిగింది. షర్మిల పోటీ చేస్తే..కాంగ్రెస్ ఓటు బ్యాంకు, వైఎస్ అభిమానుల ఓట్లు చీల్చి, అంతిమంగా పొంగులేటికి మైనస్ అయ్యి.. బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందనే లెక్కలు వేసుకున్నారు. ఆ ప్రచారమే జరిగింది. కానీ ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం కాంగ్రెస్‌కు ,ముఖ్యంగా పొంగులేటికి కొంత ఊరట కలిగించింది.

పాలేరు నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటి వరకూ ఉప ఎన్నికలతో కలుపుకుని 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, రెండు సార్లు సీపీఎం, ఒకసారి సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు గెలుపొందాయి. ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్, కాంగ్రెస్ మధ్య పొత్తులో సీట్ల సర్దుబాటు కుదరక, సీపీఎం, కాంగ్రెస్ మధ్య బ్రేకప్ అయ్యింది. దీంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంత నియోజకవర్గం కావడంతో, ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సీపీఎం పోటీతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ జరుగుతోంది. పాలేరులో కమ్యూనిస్టులు గెలిచే స్థితిలో లేకపోయినా, ఒకరి గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు ఉన్నాయి. సీపీఎం, సీపీఐలకు కొంత ఓటు బ్యాంకు ఉంది. ఇపుడు పోటీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుతారన్న భావిస్తున్నారు. అది మళ్ళీ అధికార బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ గా మారుతుందా.. అనే కోణంలో చర్చ జరుగుతోంది. గతంలో బలంగా ఉన్న వామ పక్షాలు రాను రానూ ఉద్యమాలకే పరిమితం అయ్యాయి. ఆ పార్టీ లు బలహీన పడ్డారనే వాదన వినిపిస్తోంది. మరి ఇపుడు పాలేరులో సీపీఎం పోటీతో ఎంత మేరకు ప్రభావితం చేస్తోంది..? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి..? అన్నదీ వేచి చూడాలి..!

CM Jagan Photo In Voter List : అధికారులు ఇదేం పని..! ఓటర్ల జాబితాలో తప్పులు.. మహిళ స్థానంలో జగన్ ఫొటో

AP CM Jagan Photo : ఏపీలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అధికారుల తప్పిదంతో ఓటర్ లిస్టులో మహిళ ఫొటో స్థానంలో ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటో వచ్చింది. ఓటర్ల జాబితాలో పేర్లును చెక్ చేసుకొనే సమయంలో సీఎం ఫొటోను చూసి సదరు మహిళతోపాటు స్థానికులు కంగుతిన్నారు. మహిళ ఫొటో ఉండాల్సిన ప్లేస్ లో అధికారులు ఏకంగా సీఎం జగన్ ఫొటో పెట్టడం అధికారుల పనితీరుకు అద్దంపడుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దొర్నాల మండలం వై చెర్లోపల్లి గ్రామ ఓటరు లిస్టులో ఈ తప్పిదం జరిగింది. గ్రామంకు చెందిన జనపతి గురవమ్మ అనే మహిళా ఓటర్ ఫొటో ఉండాల్సిన స్థానంలో జగన్ ఫొటోను అధికారులు ముద్రించారు. గురవమ్మ ఓటర్ లిస్ట్ చూసుకునే సమయంలో తన పేరు వద్ద జగన్ ఫొటో ఉండటాన్నిచూసి కంగుతింది. తన ఫొటో కాకుండా జగన్ ఫొటో రావడం ఏమిటని అధికారులను ప్రశ్నించింది. ఈ విషయంపై అధికారులను స్థానికులు ప్రశ్నించగా.. బీఎల్వో తప్పిదంతోనే ఇలా జరిగి ఉంటుందని చెప్పారని స్థానికులు పేర్కొన్నారు.

అయితే, ఇదే గ్రామంలో మరికొందరు ఫొటోల స్థానంలో ఏకంగా ఆధార్ కార్డు అప్ లోడ్ అయిందని స్థానికులు తెలిపారు. ఓటర్ లిస్టులో ఇలా తప్పులతడక ఉంటే ఎలా అని, అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. మరోవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నాయి.

Girl Killed : ప్రేమ పెళ్లి చేసుకుంటానన్న యువతిని హత్య చేసిన తల్లి, అన్న

Anantapur Girl Killed : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుంటానన్న యువతిని తల్లి, అన్న కలిసి హత్య చేశారు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానంటున్న యువతిని ఆమె తల్లి, అన్న కలిసి చంపేశారు.

గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో కోమల(17) అనే బాలిక పెద్దలు చూసిన సంబంధం కాకుండా నచ్చిన వాడిని చేసుకుంటానంటూ కుటుంబ సభ్యులతో గొడవ పడింది. కుమార్తె పెళ్లి చేసే విషయంలో కుటుంబ సభ్యల మధ్య గొడవ జరిగింది. బాలిక పెళ్లి సంబంధం వివాదం హత్యకు దారి తీసింది.

కోమలను తల్లి, సోదరుడు చితకబాది, ఆపై ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. కూతురును చంపిన అనంతరం పోలీస్ స్టేషన్ లో తల్లి, సోదరుడు లొంగిపోయారుు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పవన్ లేకుండానే టీడీపీ-జనసేన సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టోపై క్లారిటీ వచ్చే అవకాశం..

తెలుగుదేశం-జ‌న‌సేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండ‌బోతుంది.? రెండు పార్టీలు క‌లిసి క్షేత్రస్థాయిలో పోరాటాలు ఎలా చేస్తాయి. ఇదంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల్లో ఆస‌క్తిగా మారింది. టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదిరి రోజులు గ‌డిచిపోతుంది. అయినా ఉమ్మడి పోరాటాల‌పై మాత్రం స్పష్టత రావడం లేదు. రెండు పార్టీలు క‌లిసి ఎలా ముందుకెళ్లాల‌నే దానిపై ఉమ్మడి కార్యాచ‌ర‌ణ క‌మిటీ ఏర్పాటు చేసాయి. ఈ క‌మిటీ మొద‌టిసారి రాజ‌మండ్రిలో స‌మావేశ‌మైంది. ప్రభుత్వంపై ఆందోళ‌న‌ల కంటే రెండు పార్టీల క‌ల‌యిక‌పైనే ముందుగా దృష్టి పెట్టాయి. రాష్ట్ర స్థాయిలో జ‌రిగిన స‌మావేశానికి నారా లోకేష్‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రై క్యాడర్‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇక ఆ త‌ర్వాత జిల్లా స్థాయిలో స‌మ‌న్వయ స‌మావేశాలు జ‌రిగాయి. రెండు పార్టీల మ‌ధ్య ఎలాంటి పొర‌ప‌చ్చాలు లేకుండా క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగడంపైనే చ‌ర్చించాయి. ఒక‌రకంగా చెప్పాలంటే ఈ సమావేశాలు క్యాడర్ మ‌ధ్య క‌ల‌యిక కోసం ఏర్పాటు చేసిన‌వే. ముఖ్యంగా పొత్తు వ‌ల్ల రెండు పార్టీల నాయ‌కుల్లో గానీ కార్యక‌ర్తల్లో గానీ మ‌న‌స్పర్ధలు లేకుండా ముందుకెళ్లేలా ఈ స‌మావేశాలు నిర్వహించారు. మ‌రోవైపు ఓటు బ‌ద‌లాయింపుపైనా స‌మ‌న్వయ స‌మావేశాల్లో చర్చించారు. రెండు పార్టీల ఓట్లు ఇత‌ర పార్టీల‌కు మ‌ళ్లకుండా ఉమ్మడి అభ్యర్ధికే ఖ‌చ్చితంగా వేసేలా చూడాల‌ని స‌మావేశంలో అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తంగా రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో జ‌రిగిన సమావేశాల్లో ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేకుండా క‌లిసిక‌ట్టుగా సాగ‌డంపైనే చ‌ర్చించాయి. తాజాగా న‌వంబ‌ర్ తొమ్మిదో తేదీన మ‌రోసారి రాష్ట్ర జేఏసీ స‌మావేశం అవుతుంది. ఈ స‌మావేశంలో అన్ని అంశాల‌పై క్లారిటీ ఇచ్చే దిశ‌గా రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి.
ఉమ్మడి స‌మావేశంలో మేనిఫెస్టోపై క్లారిటీ ఇచ్చే దిశ‌గా టీడీపీ-జన‌సేన‌..
ఈ నెల తొమ్మిదో తేదీని టీడీపీ-జ‌న‌సేన ఉమ్మడి స‌మావేశం విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నుంది. ముందుగా ఈ స‌మావేశాన్ని మంగ‌ళగిరిలోని టీడీపీ కార్యాల‌యంలో జ‌ర‌పాల‌ని నిర్ణయించినప్పటికీ వేదిక‌ను విజ‌య‌వాడ‌కు మార్చారు. ఓ ప్రయివేట్ హోట‌ల్‌లో జరిగే ఈ స‌మావేశానికి నారా లోకేష్‌తో పాటు జేఏసీలోని 12 మంది స‌భ్యులు హాజ‌రుకానున్నారు. అయితే జ‌న‌సేన నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ స‌మావేశానికి హాజ‌రుకావ‌డం లేదు. ఈ స‌మావేశంలో కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. గ‌త స‌మావేశంలో మేనిఫెస్టోపై ప‌వ‌న్ క‌ళ్యాణ్-నారా లోకేష్ చ‌ర్చించారు. ఆ త‌ర్వాత ఇటీవ‌ల చంద్రబాబుతో భేటీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా మేనిఫెస్టో విడుద‌ల‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చించారు. దీనికి కొన‌సాగింపుగా గురువారం జ‌రిగే స‌మావేశంలో మేనిఫెస్టోకు తుదిరూపు తీసుకురానున్నారు. ఇప్పటికే సూప‌ర్ సిక్స్ పేరిట తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది. ఇది ప్రిలిమిన‌రీ మేనిఫెస్టో మాత్రమే..వాస్తవంగా విజ‌య‌ద‌శ‌మి రోజు పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల చేస్తామ‌ని చంద్రబాబు అరెస్ట్‌కు ముందు ప్రక‌టించారు. అది వాయిదా ప‌డింది. సూప‌ర్ సిక్స్‌తో పాటు మ‌రికొన్ని అంశాల‌తో టీడీపీ ప్రతిపాద‌న‌లు సిద్దం చేసింది. అటు జ‌న‌సేన కూడా ష‌ణ్ముక వ్యూహం పేరుతో రెండేళ్ల క్రితం ప్రక‌టించిన అంశాల‌న్నీ మేనిఫెస్టోలో పొందుప‌రిచేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్లు స‌మాచారం. రెండు పార్టీల నుంచి ఉన్న ప్రతిపాద‌న‌ల‌పై చ‌ర్చించిన త‌ర్వాత మేనిఫెస్టోపై ఓ స్పష్టత‌కు రానున్నట్లు తెలిసింది. త్వర‌లో పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల దిశ‌గా రెండు పార్టీలు సిద్దమ‌వుతున్నాయి. ఇక గురువారం జ‌రిగే స‌మావేశంలో రైతుల స‌మ‌స్యల‌పై కూడా చ‌ర్చించ‌నున్నారు. రాష్ట్రంలో నెల‌కొన్న క‌రువు, రైతుల‌ను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నట్లు తెలిసింది.
దీపావ‌ళి త‌ర్వాత ఉమ్మడి పోరాటాల‌కు సిద్దమ‌వుతున్న రెండు పార్టీలు..
తొమ్మిదో తేదీ ఉమ్మడి స‌మావేశంలో తీసుకునే నిర్ణయాల‌పై మ‌రోసారి చంద్రబాబు-ప‌వ‌న్ భేటీలో చ‌ర్చిస్తారు. దీపావ‌ళి త‌ర్వాత మ‌రోసారి ఇద్దరు నేత‌లు స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలోనే మేనిఫెస్టో విడుద‌ల‌కు తేదీని ఖ‌రారు చేయ‌నున్నారు. మ‌రోవైపు ఉమ్మడి పోరాటాల‌కు కూడా దీపావ‌ళి త‌ర్వాత ప్రత్యేక షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. చంద్రబాబు-ప‌వ‌న్ భేటీ కంటే ముందుగానే జేఏసీ నేత‌లు తాత్కాలిక షెడ్యూల్, మేనిఫెస్టోల‌కు తుదిరూపు తీసుకురానున్నారు. మొత్తానికి వ‌చ్చే వారం నుంచి దూకుడు పెంచేలా టీడీపీ-జ‌న‌సేన ప్రణాళిక‌తో ముందుకెళ్తున్నాయి.

‘దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు’.. పురందేశ్వరిపై మండిపడుతోన్న వైసీపీ నేతలు..

పురందేశ్వరి రాసిన బెయిల్ రద్దు లేఖ ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఆమె తీరుపై వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె ఏ పార్టీలో ఉన్నారు.. ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఆమె కళ్లకు కనిపించడం లేదా అంటూ నిలదీస్తోంది వైసీపీ.
సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీజేఐకి పురందేశ్వరి లేఖరాయడం పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతోంది వైసీపీ. ఆమెకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలి పదవి పార్టీకి సేవ చేసేందుకా.. లేక టీడీపీ అధినేతగా ఉన్న బావకు సేవ చేసేందుకా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. పురందేశ్వరికి డబ్బు వ్యామోహం తప్ప.. దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు. పురంధేశ్వరి దృష్టంతా పైరవీలు, సంపాదనపైనే ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి.
పురందేశ్వరికి నీతి, నిజాయితీ ఉంటే..చంద్రబాబు స్కాంలపై CBI విచారణ కోసం లేఖ రాయాలని డిమాండ్ చేశారు మంత్రి రోజా. NTR పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తూ.. చంద్రబాబు స్క్రిప్ట్‌ను పురంధేశ్వరి చదువుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌పై దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ అధ్యక్షురాలిగా కనీసం పది ఊర్లు కూడా పురందేశ్వరి తిరగలేదు. కానీ టీడీపీని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచిస్తోందని ఆరోపించారు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.
పురందేశ్వరికి పదవులు, డబ్బు పైనే ఆశ తప్ప పార్టీ గురించి ఏమాత్రం ఆలోచన లేదని ఆరోపిస్తోంది వైసీపీ. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతాలను కాదని టీడీపీకి భుజం కాస్తోందనీ.. బీజేపీని టీడీపీలో విలీనం చేసే స్థాయికి తీసుకొచ్చిందనేది వైసీపీ ఆరోపణ. పార్టీకి ద్రోహం చేస్తున్న పురందేశ్వరిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.

Vijayawada Bus Accident: గేర్‌ తప్పుగా మార్చడంతోనే ప్రమాదం.. విజయవాడ ఘటనలో ముగ్గురిపై చర్యలు

Vijayawada Bus Accident: విజయవాడ బస్టాండ్‌లోకి బస్సు దూసుకెళ్లి.. ముగ్గురు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్‌ ప్రకాశం సహా మరో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తూ ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. బస్సు డ్రైవర్‌ ప్రకాశం తప్పుగా గేర్‌ ఎంచుకోవడం వల్లే బస్సు బస్టాండ్‌లోకి దూసుకెళ్లిందని నివేదికలో పేర్కొన్నారు. దాంతో డ్రైవర్‌ ప్రకాశంపై సస్పెన్షన్‌ వేటు వేశారు. విధుల పర్యవేక్షణలో ఆటోనగర్‌ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ వి.వి.లక్ష్మి విఫలమయ్యారని నిర్ధరించారు. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టం ఉన్న బస్సుకు పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న డ్రైవర్లను పంపాల్సి ఉంది. కానీ.. అలా చేయకుండా సూపర్‌ లగ్జరీ బస్సులను నడిపిన డ్రైవర్‌ ప్రకాశాన్ని పంపారని కమిటీ తేల్చింది. కానీ.. డ్రైవర్‌కు ముందస్తుగా.. సమగ్ర శిక్షణ ఇవ్వలేదని నిర్ధారించారు. అందుకు.. ఆటోనగర్ అసిస్టెంట్ డిపో మేనేజర్ వి.వి లక్ష్మి బాధ్యతారాహిత్యమే కారణమని తెలుపుతూ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారాలను సమగ్రంగా పర్యవేక్షించాల్సిన ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ విఫలమయ్యారని కమిటీ తేల్చింది. ఆయనపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రెండు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్ లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కండక్టర్ వీరయ్య, కుమారి, చిన్నారి అయాన్స్ గా గుర్తించారు. మృతుల కటుంబ సభ్యులకు ఆర్టీసీ 5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 10 లక్షలు ప్రకటించారు.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. బస్సు ప్రమాదంతో ఆర్టీసీ డిపార్ట్‌మెంట్‌ కూడా ఉలిక్కిపడింది. వెంటనే ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేసిన ఆర్టీసీ కమిటీ.. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో.. దాని ఆధారంగా ఆర్టీసీ అధికారులు ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు.