‘దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు’.. పురందేశ్వరిపై మండిపడుతోన్న వైసీపీ నేతలు..

‘దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు’.. పురందేశ్వరిపై మండిపడుతోన్న వైసీపీ నేతలు..

పురందేశ్వరి రాసిన బెయిల్ రద్దు లేఖ ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఆమె తీరుపై వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె ఏ పార్టీలో ఉన్నారు.. ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఆమె కళ్లకు కనిపించడం లేదా అంటూ నిలదీస్తోంది వైసీపీ.
సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీజేఐకి పురందేశ్వరి లేఖరాయడం పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతోంది వైసీపీ. ఆమెకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలి పదవి పార్టీకి సేవ చేసేందుకా.. లేక టీడీపీ అధినేతగా ఉన్న బావకు సేవ చేసేందుకా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. పురందేశ్వరికి డబ్బు వ్యామోహం తప్ప.. దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు. పురంధేశ్వరి దృష్టంతా పైరవీలు, సంపాదనపైనే ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి.
పురందేశ్వరికి నీతి, నిజాయితీ ఉంటే..చంద్రబాబు స్కాంలపై CBI విచారణ కోసం లేఖ రాయాలని డిమాండ్ చేశారు మంత్రి రోజా. NTR పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తూ.. చంద్రబాబు స్క్రిప్ట్‌ను పురంధేశ్వరి చదువుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌పై దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ అధ్యక్షురాలిగా కనీసం పది ఊర్లు కూడా పురందేశ్వరి తిరగలేదు. కానీ టీడీపీని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచిస్తోందని ఆరోపించారు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.
పురందేశ్వరికి పదవులు, డబ్బు పైనే ఆశ తప్ప పార్టీ గురించి ఏమాత్రం ఆలోచన లేదని ఆరోపిస్తోంది వైసీపీ. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతాలను కాదని టీడీపీకి భుజం కాస్తోందనీ.. బీజేపీని టీడీపీలో విలీనం చేసే స్థాయికి తీసుకొచ్చిందనేది వైసీపీ ఆరోపణ. పార్టీకి ద్రోహం చేస్తున్న పురందేశ్వరిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *