Telangana Election: హాట్ సీటుగా పాలేరు.. కాంగ్రెస్, సీపీఎం పొత్తు కటీఫ్.. ఎవరి ఓట్లకు గండి..!

Telangana Election: హాట్ సీటుగా పాలేరు.. కాంగ్రెస్, సీపీఎం పొత్తు కటీఫ్.. ఎవరి ఓట్లకు గండి..!

తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ సీటుగా మారిన పాలేరు నియోజక వర్గంలో.. రోజుకో విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అందరూ ఊహించినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ షర్మిల పాలేరు పోటీ నంచి తప్పుకున్నారు. అనూహ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయితే షర్మిల తప్పుకున్నా.. ఇపుడు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీకి సై అంటున్నారు. దీంతో గెలుపు ఓటములను ప్రభావితం చేసే లెఫ్ట్ ఓటు బ్యాంకుతో.. ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంచనాలకు అందని, ఊహించని రాజకీయ పరిణామాలతో ఆసక్తి కరంగా మారింది. చివరి వరకు టికెట్‌పై ఆశ పెట్టుకున్న తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రె కి బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడంతో.. తుమ్మల కాంగ్రెస్ గూటికి చేరారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి, గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్ళు కడుగుతానని, దాని కోసమే పాలేర లో పోటీ చేస్తున్నట్లు తుమ్మల ప్రకటించారు. కానీ అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణాలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెరపైకి వచ్చారు. దీంతో తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు.

వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాలేరులో పోటీ చేస్తానని మాట ఇచ్చారు. నియోజకవర్గంలో నూతన క్యాంపు కార్యాలయం, సొంతంగా ఇళ్ళు కూడా నిర్మిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేశారు. అయితే ఉహించని విధంగా ఒక దశలో కాంగ్రెస్‌లో పార్టీ విలీనం పై చర్చలు జరిపారు. కానీ దానికి బ్రేక్ పడటంతో ఒంటరిగా పాలేరు లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు షర్మిల. కానీ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో పాలేరు రాజకీయం మరో మలుపు తిరిగింది. షర్మిల పోటీ చేస్తే..కాంగ్రెస్ ఓటు బ్యాంకు, వైఎస్ అభిమానుల ఓట్లు చీల్చి, అంతిమంగా పొంగులేటికి మైనస్ అయ్యి.. బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందనే లెక్కలు వేసుకున్నారు. ఆ ప్రచారమే జరిగింది. కానీ ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం కాంగ్రెస్‌కు ,ముఖ్యంగా పొంగులేటికి కొంత ఊరట కలిగించింది.

పాలేరు నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటి వరకూ ఉప ఎన్నికలతో కలుపుకుని 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, రెండు సార్లు సీపీఎం, ఒకసారి సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు గెలుపొందాయి. ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్, కాంగ్రెస్ మధ్య పొత్తులో సీట్ల సర్దుబాటు కుదరక, సీపీఎం, కాంగ్రెస్ మధ్య బ్రేకప్ అయ్యింది. దీంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంత నియోజకవర్గం కావడంతో, ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సీపీఎం పోటీతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ జరుగుతోంది. పాలేరులో కమ్యూనిస్టులు గెలిచే స్థితిలో లేకపోయినా, ఒకరి గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు ఉన్నాయి. సీపీఎం, సీపీఐలకు కొంత ఓటు బ్యాంకు ఉంది. ఇపుడు పోటీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుతారన్న భావిస్తున్నారు. అది మళ్ళీ అధికార బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ గా మారుతుందా.. అనే కోణంలో చర్చ జరుగుతోంది. గతంలో బలంగా ఉన్న వామ పక్షాలు రాను రానూ ఉద్యమాలకే పరిమితం అయ్యాయి. ఆ పార్టీ లు బలహీన పడ్డారనే వాదన వినిపిస్తోంది. మరి ఇపుడు పాలేరులో సీపీఎం పోటీతో ఎంత మేరకు ప్రభావితం చేస్తోంది..? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి..? అన్నదీ వేచి చూడాలి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *