Vijayawada Bus Accident: గేర్‌ తప్పుగా మార్చడంతోనే ప్రమాదం.. విజయవాడ ఘటనలో ముగ్గురిపై చర్యలు

Vijayawada Bus Accident: గేర్‌ తప్పుగా మార్చడంతోనే ప్రమాదం.. విజయవాడ ఘటనలో ముగ్గురిపై చర్యలు

Vijayawada Bus Accident: విజయవాడ బస్టాండ్‌లోకి బస్సు దూసుకెళ్లి.. ముగ్గురు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్‌ ప్రకాశం సహా మరో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తూ ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. బస్సు డ్రైవర్‌ ప్రకాశం తప్పుగా గేర్‌ ఎంచుకోవడం వల్లే బస్సు బస్టాండ్‌లోకి దూసుకెళ్లిందని నివేదికలో పేర్కొన్నారు. దాంతో డ్రైవర్‌ ప్రకాశంపై సస్పెన్షన్‌ వేటు వేశారు. విధుల పర్యవేక్షణలో ఆటోనగర్‌ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ వి.వి.లక్ష్మి విఫలమయ్యారని నిర్ధరించారు. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టం ఉన్న బస్సుకు పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న డ్రైవర్లను పంపాల్సి ఉంది. కానీ.. అలా చేయకుండా సూపర్‌ లగ్జరీ బస్సులను నడిపిన డ్రైవర్‌ ప్రకాశాన్ని పంపారని కమిటీ తేల్చింది. కానీ.. డ్రైవర్‌కు ముందస్తుగా.. సమగ్ర శిక్షణ ఇవ్వలేదని నిర్ధారించారు. అందుకు.. ఆటోనగర్ అసిస్టెంట్ డిపో మేనేజర్ వి.వి లక్ష్మి బాధ్యతారాహిత్యమే కారణమని తెలుపుతూ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారాలను సమగ్రంగా పర్యవేక్షించాల్సిన ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ విఫలమయ్యారని కమిటీ తేల్చింది. ఆయనపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రెండు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్ లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కండక్టర్ వీరయ్య, కుమారి, చిన్నారి అయాన్స్ గా గుర్తించారు. మృతుల కటుంబ సభ్యులకు ఆర్టీసీ 5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 10 లక్షలు ప్రకటించారు.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. బస్సు ప్రమాదంతో ఆర్టీసీ డిపార్ట్‌మెంట్‌ కూడా ఉలిక్కిపడింది. వెంటనే ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేసిన ఆర్టీసీ కమిటీ.. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో.. దాని ఆధారంగా ఆర్టీసీ అధికారులు ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *