ఈ మద్య రైలు ప్రమాదాలు వరుసగా జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా బేసిన్ బ్రిడ్జి సమీపంలోని లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో గురువారం మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ట్రైన్ దూకి పరుగులు తీశారు. లోకమాన్య తిలక్ ఎక్స ప్రెస్ ట్రైన్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చెన్నై నుంచి ముంబైకి బయలుదేరింది. బయలుదేరి కొద్ది నిమిషాల్లోనే చెన్నై బేసిన్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే ట్రైన్ ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో లోకో పైలట్ ట్రైన్ ని నిలిపివేశాడు. వెంటనే రైల్వే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. హుటాహుటిన సిబ్బంది వచ్చి ఇంజన్ లోని మంటలు కంపార్ట్ మెంట్స్ కి వ్యాపించకుండా గంటపాటు పోరాడి మొత్తానికి మంటలను ఆర్పివేశారు.
మంటలు కంట్రోల్ లోకి తెచ్చిన తర్వాత రీప్లేస్ మెంట్ ఇంజన్ ని అమర్చి రైలు అక్కడ నుంచి బయటుదేరేందుకు సిద్దం చేశారు. హై వోల్టేజీ లైన్ పై రుద్దుకు పోవడంతో ఇంజన్ లో మంటలు చెలరేగినట్టు సమాచారం. అయితే ఖచ్చితమైన కారణం గురించి వివరాలు తెలియరాలేదు. ట్రైన్ లో నుంచి మంటలు రావడంతో దట్టంగా పొగ అల్లుకుంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారే భయంతో వణికిపోయారు.. ఆగమేఘాల మీద ట్రైన్ దూకి పరుగులు పెట్టారు. ఈ ఘటన అక్కడ తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా, రైల్ మంటల కారణంగా అరక్కోణం మీదుగా వెళ్లే రైళ్లు కొద్దిపాటి ఆలస్యంగా వెళ్తాయని అధికారులు తెలిపారు.

